janamvoice.com
Newspaper Banner
Date of Publish : 19 January 2026, 2:42 am Digital Edition : GATTU MAHESH

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి.

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి.

-సీఎం రేవంత్ రెడ్డిని కోరిన టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా అధ్యక్షుడు.

జనం వాయిస్, ఖమ్మం:

ఖమ్మం నగరంలో నిర్వహించిన సీపీఐ శతాబ్ది ఉత్సవాల సభకు విచ్చేసిన సందర్భంగా,  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డిని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజెఎఫ్) ఖమ్మం జిల్లా అధ్యక్షుడు సంతోష్ చక్రవర్తి, వారి బృందం కలిసి వినతి పత్రం సమర్పించారు. సర్దార్ పటేల్ స్టేడియం మైదానంలో, రెండవ గేటు సమీపంలో ముఖ్యమంత్రి సభకు హాజరవుతున్న సమయంలో ఈ భేటీ జరిగింది.
ఈ సందర్భంగా సంతోష్ చక్రవర్తి మాట్లాడుతూ, గత మూడు దశాబ్దాలుగా జర్నలిస్టులు ఇంటి స్థలాల కోసం ఎదురు చూస్తున్నారని, గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలుకాలేదని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికైనా స్పష్టమైన ప్రకటన చేసి జర్నలిస్టుల గూడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. జర్నలిస్టుల వృత్తి భద్రతకు, కుటుంబ స్థిరత్వానికి ఇంటి జాగాలు అత్యవసరమని వినతి పత్రంలో పేర్కొన్నారు.
సభకు హాజరవుతున్న తరుణంలో సమయాభావం కారణంగా ముఖ్యమంత్రి ఈ అంశాన్ని సూచన ప్రాయంగా స్వీకరించినట్లు, ఫోటోలకు కూడా సమయం లేదని సౌమ్యంగా తెలియజేశారని టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా అధ్యక్షుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజెఎఫ్, (టీబీజేఏ) జిల్లా అధ్యక్షులు వందనపు సామ్రాట్ గుప్తా,ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు వెలుగోటి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి కుంభం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.