బన్నీ సలహా.. ప్రభాస్‌పై కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు.
జనం వాయిస్, సినిమా, మే 24:
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సహనటుల గురించి చెప్పిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు మరోసారి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ ఇచ్చిన ఓ విలువైన సలహా తన నటనలో ఎంతో మార్పు తీసుకువచ్చిందని, ప్రభాస్‌తో నటించిన అనుభవం చాలా ప్రత్యేకమని కాజల్ చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
సినిమా సెట్లలో అందరితోనూ మంచి అనుబంధం ఉండేదని తెలిపిన కాజల్.. సహనటుల నుంచి వచ్చే సూచనలను తాను ఎప్పుడూ స్వాగతిస్తానని పేర్కొన్నారు. కొన్నిసార్లు వాళ్లు చెప్పిన చిన్న చిన్న విషయాలే నటనలో పెద్ద మార్పు తీసుకువస్తాయని అన్నారు. అలాంటి ఒక ముఖ్యమైన సూచన తనకు అల్లు అర్జున్ నుంచి వచ్చిందని గుర్తుచేసుకున్నారు.
తాను సహజంగానే చాలా చురుకైన వ్యక్తినని, దర్శకుడు “కట్” అని చెప్పగానే వెంటనే ఆ సన్నివేశంలోని భావోద్వేగం నుంచి బయటకు వచ్చేసేదాన్నని కాజల్ తెలిపారు. అయితే అల్లు అర్జున్ మాత్రం “కెమెరా పూర్తిగా ఆగే వరకు ఆ భావోద్వేగాన్ని అలాగే కొనసాగించాలి” అని చెప్పారని వెల్లడించారు. అలా చేస్తే ఎడిటింగ్ సమయంలో సన్నివేశం మరింత సహజంగా కనిపిస్తుందని బన్నీ వివరించాడని చెప్పారు. ఆ సలహా తనకు ఎంతో ఉపయోగపడిందని, ఇప్పటికీ అదే పద్ధతిని పాటిస్తున్నానని కాజల్ వెల్లడించారు.
ఇక సహనటుల ఎత్తు గురించి మాట్లాడిన కాజల్.. తనతో నటించిన హీరోలు చాలా పొడవుగా ఉండేవారని సరదాగా చెప్పారు. అందుకే తాను సాధారణంగా ఎక్కువ ఎత్తైన హీల్స్ ధరించేదాన్ని కాదని తెలిపారు. ఎక్కువగా ఒకటి లేదా రెండు అంగుళాల హీల్స్ మాత్రమే వేసుకునేదాన్నని పేర్కొన్నారు.
అయితే ప్రభాస్‌తో కలిసి నటించిన సమయంలో మాత్రం తనకు మంచి కంఫర్ట్ ఫీలింగ్ ఉండేదని కాజల్ అన్నారు. “డార్లింగ్” సినిమా సమయంలో ప్రభాస్ ఎత్తు కారణంగా తాను నాలుగు నుంచి ఆరు అంగుళాల వరకు ఉన్న హీల్స్ కూడా ధరిచానని చెప్పారు. స్టిలెటోస్ వేసుకుని సౌకర్యంగా నటించగలిగానని గుర్తుచేసుకున్నారు. ప్రభాస్‌తో పని చేయడం చాలా హ్యాపీ అనుభవమని తెలిపారు.
గ్లామర్ గురించి కూడా కాజల్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. గ్లామర్ అంటే కేవలం అందాల ప్రదర్శన కాదని, నటనలోని సొగసు కూడా అంతే ముఖ్యమని అన్నారు. చీరలోనైనా, పూర్తి చేతుల దుస్తుల్లోనైనా ఒక నటి ఎంతో ఆకర్షణీయంగా కనిపించవచ్చని చెప్పారు. సొగసుకు, అసభ్యతకు మధ్య చాలా సున్నితమైన గీత ఉంటుందని, తాను ఎప్పుడూ ఆ గీత దాటేలా ప్రవర్తించనని స్పష్టం చేశారు.
తన కుటుంబ సభ్యులతో కలిసి చూసేందుకు ఇబ్బంది కలిగించేలా ఎప్పుడూ పాత్రలు చేయనని కూడా కాజల్ పేర్కొన్నారు. నటిగా గ్లామర్ కంటే నటనకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని, అదే తనకు ముఖ్యమని తెలిపారు. ప్రస్తుతం కాజల్ చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి.