janamvoice.com
Newspaper Banner
Date of Publish : 26 November 2025, 8:41 pm Digital Edition : GATTU MAHESH

కవిత రాజకీయ పార్టీ ఏర్పాటు పై స్పందన

కవిత రాజకీయ పార్టీ ఏర్పాటు పై స్పందన.

-పార్టీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కవిత స్పష్టం.

-ప్రజల సమస్యలు పరిష్కరించే శక్తి ఉన్న పార్టీ అవసరమని అభిప్రాయం.

-కాంగ్రెస్‌ బీసీ రిజర్వేషన్ విధానంపై తీవ్ర విమర్శలు.

జనం వాయిస్,హైదరాబాద్:

రాజకీయ పార్టీ ఏర్పాటు పై జరుగుతున్న చర్చల నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఏర్పాటు గురించి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని, అయితే మహిళల నుంచి పార్టీ స్థాపనకు పెరుగుతున్న డిమాండ్‌ను ఖండించలేమని ఆమె తెలిపారు. ప్రజల సమస్యలు తీర్చే శక్తి ఉన్న సంస్థ ఏదైనా మంచి రాజకీయ ప్రత్యామ్నాయంగా మారవచ్చని అభిప్రాయపడ్డారు. కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్ గురించి తాను మాట్లాడబోనని స్పష్టం చేశారు. తాను మాట్లాడితే తమ మాటను వక్రీకరిస్తూ బద్నాం చేసే ప్రయత్నాలు జరుగుతాయని విమర్శించారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని, విడుదల చేసిన నివేదిక తప్పులతడకగా ఉందని ఆమె ఆగ్రహించారు. ఇంత కీలకమైన సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా చూస్తుందో బీజేపీ కూడా ప్రశ్నించకపోవడం ఆశ్చర్యమని వ్యాఖ్యానించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు తగిన ప్రాధాన్యం కల్పించేందుకు జాగృతి తరఫున ప్రత్యేక వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ గ్రామాల్లో బీసీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రతి గ్రామ పంచాయతీలో బీసీ అభ్యర్థులు గెలవడానికి తమ వంతు కృషి చేస్తామని కవిత తెలిపారు. బీసీ హక్కుల కోసం పోరాటం చేస్తున్న సంఘాలతో కలిసి ముందుకు సాగేందుకు తమ సిద్ధతను వ్యక్తం చేశారు. గ్రామాల్లో కాంగ్రెస్ అధికారం ఉన్నంత కాలం బీసీలకు అన్యాయం తప్పదని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గడానికి కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలే కారణమని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌కు నిజాయితీ లేదని ఆమె ఘాటుగా విమర్శించారు. ప్రజలు, రాజకీయ పార్టీలు ఇప్పటికైనా మేల్కొని బీసీ హక్కులను కాపాడడానికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.