వెలుగుమట్ల బాధితులను పరామర్శించిన కవిత.
ఇళ్ల కూల్చివేతలపై ప్రభుత్వానికి హెచ్చరిక.
బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని భరోసా.
ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్.
జనం వాయిస్, ఖమ్మం, మార్చి 09:
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఇళ్లు కోల్పోయి కన్నీరు పెట్టుకుంటున్న మహిళలను చూసి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆడబిడ్డల దుఃఖం, వారి కన్నీళ్లు ప్రభుత్వానికి మంచిది కాదని హెచ్చరించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడిన కవిత, తాను ఇక్కడకు పర్యాటకురాలిగా రాలేదని స్పష్టం చేశారు. సమస్యకు పరిష్కారం దొరికే వరకు ఇక్కడే ఉండి పోరాడతానని బాధితులకు భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత మంత్రులు వెంటనే వెలుగుమట్లకు వచ్చి బాధితులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
పేదల ఇళ్లపై బుల్డోజర్లు పంపడం అన్యాయమని కవిత మండిపడ్డారు. కొన్ని రాజకీయ పార్టీలు ప్రజల దుఃఖాన్ని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని ఆరోపించారు. గతంలో కూడా ఇళ్ల కూల్చివేతకు ప్రయత్నాలు జరిగాయని ఆమె పేర్కొన్నారు. ఇళ్లను కూల్చివేసిన ప్రాంతాల్లోనే బాధితులకు తిరిగి స్థలాలు కేటాయించి ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు, సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేశారు.