janamvoice.com
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 4:19 pm Digital Edition : JANAM VOICE

కేసీఆర్‌పై కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

కేసీఆర్‌పై కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

ఉద్యమ నాయకుడిగా గొప్ప వ్యక్తి అన్న కవిత.
ప్రజలకు క్రమంగా దూరమయ్యారన్న వ్యాఖ్యలు.
పరిపాలన శైలిపై కీలక అభిప్రాయాలు.

జనం వాయిస్, హైదరాబాద్, మే 15:

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఎంతో గొప్ప వ్యక్తి అని, ఆ విషయంలో ఎవరికీ సందేహాలు లేవని పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ప్రజలకు క్రమంగా దూరమయ్యారని అభిప్రాయపడ్డారు. ఒక మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కవిత, కేసీఆర్ పరిపాలన శైలిపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఒక యంత్రంలా పనిచేసేవారని వ్యాఖ్యానించారు. ప్రజల భావోద్వేగాలు, సమస్యలను అర్థం చేసుకునే విషయంలో దూరం ఏర్పడిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఉద్యమ నాయకత్వం నుంచి పరిపాలనా బాధ్యతల్లోకి మారిన తర్వాత పరిస్థితులు మారిపోయాయని పేర్కొన్నారు. భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేతగా కేసీఆర్ చాలా కఠినంగా ఉండేవారని కవిత తెలిపారు. కుటుంబ సభ్యులకే సమస్యలు చెప్పుకునే అవకాశం తక్కువగా ఉండేదని గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండని వ్యక్తి సామాన్య ప్రజల సమస్యలు ఎలా వింటారనే ప్రశ్నను ఆమె లేవనెత్తారు. ప్రజలతో మరింత చేరువగా ఉండాల్సిన అవసరం ఉందని పరోక్షంగా సూచించారు. ఉద్యమ నాయకుడి నుంచి యంత్రంలా పనిచేసే ముఖ్యమంత్రిగా మారిన తీరు ప్రస్తుత రాజకీయ పరిణామాలకు ఒక కారణమై ఉండవచ్చని కవిత అభిప్రాయపడ్డారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.