janamvoice.com
Newspaper Banner
Date of Publish : 01 February 2026, 7:44 pm Digital Edition : GATTU MAHESH

నందినగర్‌లో కేసీఆర్‌ సిట్‌ విచారణ.భావోద్వేగానికి లోనైన మాజీ సీఎం.

నందినగర్‌లో కేసీఆర్‌ సిట్‌ విచారణ.భావోద్వేగానికి లోనైన మాజీ సీఎం.

– మధ్యాహ్నం 3 గంటల నుంచి విచారణ ప్రారంభ.

– తెలంగాణ సాధన గదిలోనే దర్యాప్తు.

– న్యాయవాదులకు అనుమతి నిరాకరణ.

– నందినగర్‌లో కట్టుదిట్టమైన భద్రత.

జనం వాయిస్, హైదరాబాద్‌:

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్ సిట్‌ విచారణను ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌ నందినగర్‌లోని ఆయన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి విచారణ ప్రారంభమైంది. విచారణకు ముందు మధ్యాహ్న భోజన సమయంలో కేసీఆర్‌ తీవ్ర భావోద్వేగానికి లోనైనట్లు సమాచారం. తెలంగాణ సాధనకు వ్యూహరచన చేసిన అదే గదిలో ఇప్పుడు విచారణ ఎదుర్కోవాల్సి రావడం తనను తీవ్రంగా కలచివేసిందని కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. “స్వరాష్ట్ర సాధన కోసం ఇదే గదిలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. కీలక చర్చలు జరిపాను. అలాంటి చోట ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదు” అని ఆయన వ్యాఖ్యానించినట్టు వర్గాలు తెలిపాయి. విచారణ నేపథ్యంలో నందినగర్‌ పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీ బందోబస్తును మోహరించారు. విచారణ ప్రారంభం కాగానే మాజీ మంత్రి హరీష్ రావు తో పాటు ఇతర నేతలను నివాసం నుంచి బయటకు పంపించారు. నిబంధనల ప్రకారం కేసీఆర్‌ తరఫున న్యాయవాదులను లోపలికి అనుమతించేందుకు సిట్‌ అధికారులు నిరాకరించినట్లు సమాచారం. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ నుంచి ఉదయం నందినగర్‌కు చేరుకున్న కేసీఆర్‌ మధ్యాహ్నం నుంచి సిట్‌ విచారణలో పాల్గొన్నారు. ఈ కేసు విచారణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. విచారణలో వెలువడే అంశాలపై రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.