బీజేపీ అభ్యర్థిగా సోనియా గాంధీ..
– కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారిన స్థానిక ఎన్నికలు..!
జనం వాయిస్, కేరళ:
కేరళ స్థానిక ఎన్నికల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మున్నార్ పంచాయతీ ఎన్నికలో కమలం పార్టీ వ్యూహాత్మకంగా అడుగు వేసింది. కాంగ్రెస్‌కు గట్టి ఎదురు దెబ్బ ఇవ్వాలనే ప్రయత్నంలో, సోనియా గాంధీ పేరున్న మహిళను బరిలోకి దింపింది. పేరుతోనే దేశ రాజకీయాల్లో ప్రభావం చూపిన వ్యక్తిని గుర్తు చేసే ఈ నిర్ణయం, స్థానికంగా హస్తం పార్టీకి భారీ చిక్కులు సృష్టించింది.మరో వారం రోజుల్లో జరగనున్న కేరళ స్థానిక ఎన్నికలు రెండు దశల్లో జరుగనున్నాయి. డిసెంబరు 9, 11 తేదీల్లో పోలింగ్ నిర్వహించి, 13న ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలూ అభ్యర్థులతో బరిలోకి దిగి హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నాయి.అలాంటి పరిస్థితుల్లో మున్నార్ పంచాయతీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా మంజుల రమేశ్‌ను నిలబెట్టింది. అదే స్థానానికి బీజేపీ, ‘సోనియా గాంధీ’ అనే స్థానిక మహిళను నిలబెట్టడం పెద్ద చర్చకు దారితీసింది. ఈ పేరు చూసిన ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశముందని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఈ అంశమే ప్రధానంగా మారింది.సోనియా గాంధీ పేరున్న ఈ మహిళపై ఇప్పుడు స్థానిక ప్రజల దృష్టంతా కేంద్రీకరించబడింది. కమలం పార్టీ అనుసరిస్తున్న వ్యూహాత్మక ప్రచారం కారణంగా ఈ పేరు ఇప్పుడు పంచాయతీ పరిధిలో ఒక్కసారిగా మార్మోగిపోతోంది. ఈ అనూహ్య పరిణామం కేరళ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది