యాసంగి రైతు భరోసాపై కీలక అప్‌డేట్.. నిధుల విడుదల ఎప్పుడంటే..!
– యాసంగి రైతు భరోసా కోసం ప్రభుత్వ కసరత్తు.
– నిధుల కోసం బహిరంగ మార్కెట్ నుంచి రూ.9,000 కోట్ల రుణం.
– ఈ నెల 10న ఆర్బీఐ ద్వారా నిధుల సమీకరణకు ప్లాన్.
– మున్సిపల్ ఎన్నికల తర్వాతే నిధులు జమ చేస్తామన్న సీఎం రేవంత్.
జనం వాయిస్, హైదరాబాద్:
తెలంగాణ రైతులకు యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం బహిరంగ మార్కెట్ నుంచి రూ.9,000 కోట్ల రుణం.సమీకరించేందుకు నిర్ణయించి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఇండెంట్ సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి రుణం తీసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ నెల 10న ఆర్బీఐ నిర్వహించే ఈ–వేలం ద్వారా నిధులను సమీకరించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. 13 ఏళ్ల కాలపరిమితితో రూ.2,000 కోట్లు, 16 ఏళ్లకు మరో రూ.2,000 కోట్లు, 21 ఏళ్ల కాలపరిమితితో రూ.2,500 కోట్లు, 27 ఏళ్లకు రూ.2,500 కోట్ల చొప్పున రుణం తీసుకోనుంది. ఈ–వేలం ప్రక్రియ పూర్తయ్యాక నిధులు రాష్ట్ర ఖజానాకు చేరనున్నాయి. ఇప్పటికే యాసంగి సీజన్‌కు అర్హులైన రైతుల జాబితా సిద్ధమైనట్లు సమాచారం. అయితే రైతులకు నిధులు ఎప్పుడు జమ అవుతాయన్న అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన వెంటనే రైతు భరోసా నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ఇటీవల ఆయన ప్రకటించారు. దీంతో రుణం సమీకరణ ప్రక్రియ పూర్తయినా, ఎన్నికల అనంతరమే రైతుల ఖాతాల్లోకి డబ్బులు చేరే అవకాశం ఉందని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం పార్టీలకతీతంగా, ఎలాంటి వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని సీఎం పేర్కొన్నారు. ఇప్పటికే పంట రుణాల మాఫీ కింద రైతులకు రూ.21 వేల కోట్లు అందించామని, సన్న వడ్లకు రూ.500 బోనస్ కూడా ఇచ్చామని గుర్తుచేశారు. రైతు భరోసా నిధుల విడుదలపై త్వరలోనే స్పష్టమైన షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.