మణుగూరు బీఆర్‌ఎస్ కార్యాలయంపై దాడి
— కాంగ్రెస్ అరాచకంపై కేటీఆర్ ఆగ్రహం.
జనం వాయిస్,మణుగూరు,నవంబర్ 2:
మణుగూరు పట్టణంలోని భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి దహనం చేసిన ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో చట్టవ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గూండాల రాజ్యం ప్రబలిందని ఆయన విమర్శించారు.ఈ ఘటనపై స్పందించిన కేటీఆర్, “ప్రజాస్వామ్యంలో రాజకీయ భిన్నాభిప్రాయాలు సహజం కానీ, ప్రత్యర్థి పార్టీలపై దాడులు, ఆస్తుల ధ్వంసం అసహ్యం.ఇది కాంగ్రెస్ పార్టీ దుస్సహ పాలనకు నిదర్శనం. రాష్ట్రం మొత్తంలో రౌడీయిజం, హింస పెరిగిపోతోంది” అని అన్నారు.సంఘటన విషయం తెలుసుకున్న వెంటనే కేటీఆర్, జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావుతో ఫోన్‌లో మాట్లాడి సంఘటన వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “60 లక్షల బీఆర్‌ఎస్ కుటుంబమంతా మణుగూరు శ్రేణులతో ఉంది. భయపడకండి, ధైర్యంగా నిలబడండి. త్వరలోనే మణుగూరును స్వయంగా సందర్శిస్తాను” అని భరోసా ఇచ్చారు. “కాంగ్రెస్ పార్టీ రౌడీ మూకలు ఎంతగా అరాచకానికి పాల్పడినా, ప్రజలు వీరి అసలు స్వరూపాన్ని గుర్తించేస్తున్నారు.గ్రామాల నుంచి రాజధాని దాకా రౌడీల రాజ్యం కొనసాగుతోంది.కానీ ఈ అహంకారానికి, ఈ దుర్వ్యవస్థకు చరమగీతం పాడే రోజు చాలా దూరంలో లేదు” అని తీవ్రంగా హెచ్చరించారు.