janamvoice.com
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 12:33 pm Digital Edition : JANAM VOICE

సింగరేణి కార్మికులకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి.

సింగరేణి కార్మికులకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి.

  • కార్మికుల సంక్షేమంపై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదు.
  • పదేళ్ల బీఆర్ఎస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే విమర్శలు.
  • రామగుండాన్ని బొందలగడ్డగా మార్చిన ఘనత బీఆర్ఎస్‌దే.
  • రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ధ్వజం.

జనం వాయిస్, గోదావరిఖని, అక్టోబర్ 16:

సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్మికులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని రామగుండం ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. శుక్రవారం గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, ఇప్పుడు కార్మికుల సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదని మండిపడ్డారు. గత ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కార్మికులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, కార్మికులకు 34 శాతం లాభాల వాటా అందించడంతో పాటు మారుపేర్ల సమస్య పరిష్కారం, సొంతింటి కల సాకారం కోసం కృషి చేస్తోందని తెలిపారు. డిస్మిస్ అయిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునే దిశగా చర్యలు చేపడుతున్నామని, కార్మికులకు కోటి రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో విజిలెన్స్ కేసుల పేరుతో కార్మికులను వేధించారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు కార్మికుల సమస్యలను పరిష్కరించని కేటీఆర్ ఇప్పుడు వారిపై ప్రేమ ఒలకబోయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రామగుండం ప్రాంత ప్రజల కష్టార్జితంతో సిరిసిల్ల, సిద్దిపేట ప్రాంతాలను అభివృద్ధి చేసుకొని, రామగుండాన్ని మాత్రం నిర్లక్ష్యం చేసి బొందలగడ్డగా మార్చిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బెల్లంపల్లి, మంచిర్యాల, శ్రీరాంపూర్ ప్రాంతాల నుంచి ప్రజలను తీసుకొచ్చి రామగుండంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే అవకాశం కల్పించినందుకు కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నానని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన కాసోజు శ్రీకాంతాచారిని గుర్తించని కేటీఆర్‌కు గోదావరిఖని బిడ్డ, ప్యారడైజ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాత్రం గుర్తుకొచ్చారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారుడు గద్దర్ అంత్యక్రియలకు కూడా హాజరుకాలేదని ఆరోపించారు. ఉద్యమకారుల త్యాగాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణకు, వారి కుటుంబాల భవిష్యత్తుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కార్మికులకు వాస్తవాలు తెలుసునని, సరైన సమయంలో బీఆర్ఎస్‌కు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.