ఫుట్‌బాల్ వదిలేసి క్రికెట్ వైపు.. ఆర్సీబీ పేసర్‌తో అభిమానుల క్రేజ్..!
జనం వాయిస్, స్పోర్ట్స్ న్యూస్:
మహిళల ప్రీమియర్ లీగ్‌లో మాజీ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణిస్తూ ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టుతోంది. ఈ విజయాల వెనుక కీలకంగా మారుతున్న పేరు ఇంగ్లండ్‌కు చెందిన పొడగరి పేసర్ లారెన్ బెల్. పవర్ ప్లేలోనే వికెట్లు తీస్తూ శుభారంభాలు ఇస్తున్న ఆమె ప్రదర్శనతో పాటు ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో అభిమానుల మనసు దోచుకుంటోంది.
లీగ్ నాలుగో సీజన్‌లో లారెన్ బెల్ లైన్ అండ్ లెంగ్త్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెడుతోంది. తొలి ఓవర్లలోనే కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్ దిశను మార్చేస్తోంది. అయితే చిన్ననాటి కల మాత్రం క్రికెట్ కాదు. చిన్న వయసులో ఫుట్‌బాల్‌పై ఎక్కువ ఆసక్తి చూపిన ఆమె స్థానిక అకాడమీ తరఫున కూడా ఆడింది. అయితే ఒకే సమయంలో ఫుట్‌బాల్, క్రికెట్ రెండింటినీ కొనసాగించడం కష్టంగా మారడంతో చివరకు 16 ఏళ్ల వయసులో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంది.
ఇంగ్లండ్‌లోని స్విండన్ పట్టణంలో జన్మించిన లారెన్ బెల్ 2022లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత నిలకడైన ప్రదర్శనతో ఇంగ్లండ్ జట్టులో ప్రధాన పేసర్‌గా స్థానం సంపాదించింది. ఇప్పటివరకు వన్డేల్లో 44, టెస్టుల్లో 18, టీ20ల్లో 50 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటింది.
గత ఏడాది భారత్‌లో జరిగిన ప్రపంచకప్‌లో 6 వికెట్లు తీసిన ప్రదర్శనతో ఆమెపై ఫ్రాంచైజీల దృష్టి పడింది. వేలంలో 30 లక్షల కనీస ధరతో ప్రవేశించిన లారెన్ బెల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 90 లక్షలకు సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్ నుంచే ఫ్రాంచైజీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రత్యర్థి జట్లకు గట్టి షాక్ ఇస్తోంది. ఆమె వేగం, నియంత్రణతో పాటు ఆత్మవిశ్వాసమే ప్రస్తుతం ఆర్సీబీ విజయాలకు ప్రధాన బలంగా మారింది.