janamvoice.com
Newspaper Banner
Date of Publish : 09 December 2025, 9:05 pm Digital Edition : GATTU MAHESH

కారు కోసం ప్రత్యేక సంఖ్య.- ₹27.50 లక్షలకు అమ్ముడైన ‘0001’.

కారు కోసం ప్రత్యేక సంఖ్య.- ₹27.50 లక్షలకు అమ్ముడైన ‘0001’.

జనం వాయిస్,నోయిడా,డిసెంబర్ 09:

నోయిడాలో ప్రైవేట్ వాహనాల ప్రత్యేక నంబర్‌ల కోసం నిర్వహించిన ఆన్‌లైన్‌ వేలం పెద్ద రికార్డునే సృష్టించింది.అత్యంత ప్రాధాన్యమున్న UP16FH 0001 సంఖ్య ఈసారి ఆశ్చర్యకరమైన మొత్తానికి అమ్ముడై అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది.ప్రారంభ బిడ్ కేవలం ₹33,333 మాత్రమే ఉండగా, పోటీ పెరుగుతూ చివరకు ఈ సంఖ్య ₹27.50 లక్షలకు చేరింది.ఈ సంఖ్యను దక్కించుకున్నది నోయిడాకు చెందిన ఏవియోరియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఔషధ సంస్థ.కంపెనీ యాజమాన్యం నూతన మెర్సిడెస్ వాహనం కోసం ఈ నంబర్‌ను బుక్ చేసుకోగా,నియమాల ప్రకారం ముందుగా డిపాజిట్ చేసిన మొత్తం, అనంతరం నిర్ణీత సమయంలో పూర్తి చెల్లింపు పూర్తిచేయడంతో ఈ ప్రత్యేక సంఖ్య అధికారికంగా వారి పేరుమీద నమోదైంది.
ఉత్తరప్రదేశ్‌ సహా ఢిల్లీ–ఎన్‌సీఆర్ ప్రాంతంలో 0001 సంఖ్యకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. వ్యాపారవేత్తలు, సంస్థలు, హై-ప్రొఫైల్ వాహన యజమానులు ఈ సంఖ్యను ప్రతిష్టగా భావిస్తారు. అందువల్ల ప్రతిసారీ వేలంలో భారీ పోటీ నెలకొంటుంది. గతంలోనూ ఇలాంటి ప్రత్యేక సంఖ్యలు అధిక బిడ్లకే అమ్ముడయ్యాయి. అయితే ఈసారి వచ్చిన ధర పూర్వ రికార్డులను మించి నిలిచింది.
వేలం ద్వారా పొందిన మొత్తం ప్రభుత్వ ఖాతాలోకి చేరుతుంది. వాహన యజమానులు తమకు నచ్చిన సంఖ్యను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఈసారి UP16FH 0001 సంఖ్యకు లభించిన ఆదరణ మరోసారి ఈ నంబర్‌కు ఉన్న ప్రత్యేకతను స్పష్టంగా చూపించింది.