చంద్రగ్రహణం.. ప్రముఖ ఆలయాల మూసివేత
జనం వాయిస్, వెబ్ డెస్క్:
సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. మంగళవారం మధ్యాహ్నం 3.21గంటలకు గ్రహణం ప్రారంభమై రాత్రి 7.52గంటల వరకు ఉండనుంది. చంద్రగ్రహణం నేపథ్యంలో సంప్రదాయ ఆచారాలను అనుసరిస్తూ రెండు తెలుగు రాష్ట్రల్లోనూ ప్రముఖ దేవాలయాలను తాత్కాలికంగా మూసివేస్తారు. గ్రహణం ముగిసిన అనంతరం శుద్ధి కార్యక్రమాల తర్వాత మాత్రమే భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.
*తిరుమల తిరుపతిలో*
చంద్రగ్రహణం కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) పరిధిలోని ఆలయాలన్నీ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటలకు వరకు మూసివేస్తారు. అనంతరం ఆలయ శుద్ధి కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత రాత్రి 8.30 గంటల నుంచి భక్తులకు దర్శనాలు పునఃప్రారంభం అవుతాయి. గ్రహణం నేపథ్యంలో టీటీడీ నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కేంద్రాలు కూడా తాత్కాలికంగా నిలిపివేస్తారు. చంద్రగ్రహణం కారణంగా దర్శన సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నందున, భక్తులు ముందస్తుగా సమాచారం తెలుసుకుని తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా తెలంగాణలోని పలు ప్రముఖ ఆలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నారు.
*జగిత్యాల జిల్లాలో*
జగిత్యాల జిల్లాలోని ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఇవాళ ఉదయం 9 గంటలకు మూసివేస్తారు. తిరిగి రేపు ఉదయం సంప్రోక్షణ, అభిషేక పూజల తర్వాత భక్తులకు దర్శనం కల్పిస్తారు.
*రాజన్న సిరిసిల్ల జిల్లా*
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు ఉదయం 6.15 నుంచి సాయంత్రం 7.15 వరకు మూసిస్తారు. అనంతరం పుణ్యాహవాచనం, సంప్రోక్షణ నిర్వహించి భక్తులకు దర్శనం అనుమతిస్తారు.
*యాదాద్రి*
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాలు కూడా మూసివేస్తారు. రేపు తెల్లవారుజామున 3 గంటలకు ఆలయం తెరిచి శుద్ధి, సంప్రోక్షణ నిర్వహించి, అనంతరం నిత్యపూజల తర్వాత దర్శనాలు ప్రారంభిస్తారు. ఓదెల మల్లిఖార్జున స్వామి ఆలయాన్ని గ్రహణం కారణంగా మూసివేస్తారు. రేపు ఉదయం సంప్రోక్షణ, అభిషేక పూజల అనంతరం భక్తులకు అనుమతి ఇస్తారు.
*సిద్దిపేట జిల్లా*
కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7.30 వరకు మూసివేస్తారు. ఆలయ శుద్ధి, సంప్రోక్షణ తర్వాత భక్తులకు దర్శనం కల్పిస్తారు. భక్తులు ఆలయ సమయాలను గమనించి దర్శనానికి రావాలని అధికారులు సూచిస్తున్నారు….