janamvoice.com
Newspaper Banner
Date of Publish : 27 November 2025, 11:11 am Digital Edition : GATTU MAHESH

ప్రభాస్‌తో హీరోయిన్‌గా అరంగేట్రం..-ఫ్యాన్స్‌కు మాళవిక మోహనన్ మాంచి కిక్

ప్రభాస్‌తో హీరోయిన్‌గా అరంగేట్రం..
– ఫ్యాన్స్‌కు మాళవిక మోహనన్ మాంచి కిక్

జనం వాయిస్, సినిమా:

దక్షిణ భారత సినీరంగంలో తన అందం, నటనతో గుర్తింపు సంపాదించిన మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ ఇప్పుడు టాలీవుడ్‌లో అడుగుపెట్టబోతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న “ది రాజా సాబ్” చిత్రంతో ఆమె తెలుగులో హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తోంది. ఈ సినిమాపై, ముఖ్యంగా ప్రభాస్‌తో కలిసి పనిచేసిన అనుభవంపై మాళవిక చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
సదరన్ రైజింగ్ సమ్మిట్‌ 2025లో పాల్గొన్న సమయంలో మాళవిక మాట్లాడుతూ.. స్టార్ హీరోల సినిమాల్లో సాధారణంగా హీరోయిన్ పాత్ర కొన్ని సీన్లు, పాటలకు మాత్రమే పరిమితమవుతుందని తాను అనుకున్నానని చెప్పింది. కానీ ‘ది రాజా సాబ్’లో తనకు దక్కిన రోల్ ఎంతో స్పెషల్‌గా ఉందని, తన తెలుగు డెబ్యూ ఈ విధంగా జరగడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది.
అలాగే ప్రభాస్‌తో కలిసి నటించడం తనకు ఎంతో గౌరవంగా, ప్రత్యేకమైన అనుభూతిగా అనిపించిందని మాళవిక పేర్కొంది. భారతదేశంలోనే గొప్ప సూపర్‌స్టార్లలో ఒకరైన ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం జీవితంలో మర్చిపోలేని అనుభవమని చెప్పడంతో ఆయన అభిమానులకు మరింత ఉత్సాహం ఏర్పడింది.
హారర్–కామెడీ–రోమాన్స్ మేళవింపుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్–మాళవిక జంటపై భారీ అంచనాలు ఉన్నాయి. నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌ కీలక పాత్రల్లో నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. మాళవిక చేసిన తాజా వ్యాఖ్యలతో ‘ది రాజా సాబ్’పై హైప్ మరింత పెరిగిందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.