పండగ మంటలో మాంసం ధరలు..! చికెన్, మటన్ కొనాలంటే జేబుకు చుక్కలే..!!
జనం వాయిస్, వెబ్ డెస్క్:
సంక్రాంతి పండగ వేళ మాంసాహార వినియోగం భారీగా పెరగడంతో చికెన్, మటన్ ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. గత నెల వరకు కిలో చికెన్ ధర 230 నుంచి 240 మధ్యలో ఉండగా, ప్రస్తుతం అది 350కి చేరింది. అలాగే మటన్ ధరలు 800 నుంచి ప్రారంభమై ఇప్పుడు 1050 నుంచి 1250 వరకు పలుకుతున్నాయి. దీంతో పండగకు ప్రత్యేక వంటలు చేసుకోవాలనుకునే సామాన్యులు ఖర్చుల భారంతో ఇబ్బందులు పడుతున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో దేవతలకు కోళ్లను సమర్పించే సంప్రదాయం ఉండటంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. పట్టణాల్లో కుటుంబ వేడుకలు, హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగం అధికంగా ఉండటంతో సరఫరా తక్కువగా మారింది. రవాణా ఇబ్బందులు, ఇంధన ఖర్చుల పెరుగుదల కూడా ధరలపై ప్రభావం చూపుతున్నాయి. పండగ అనంతరం కొంత మేర ధరలు తగ్గే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ పండగ రోజులలో మాత్రం మాంసాహార కొనుగోళ్లకు ఎక్కువ ఖర్చు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. అవసరాన్ని బట్టి ముందుగానే కొనుగోలు చేయడం, ఖర్చును నియంత్రించుకోవడం మంచిదని వినియోగదారులకు సూచిస్తున్నారు.