janamvoice.com
Newspaper Banner
Date of Publish : 01 February 2026, 10:21 am Digital Edition : GATTU MAHESH

సమ్మక్క–సారలమ్మ ఆశీస్సులతో మేడారం మహాజాతర ఘన విజయం.

సమ్మక్క–సారలమ్మ ఆశీస్సులతో మేడారం మహాజాతర ఘన విజయం.

– భక్తుల సహకారంతో చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహణ.
– ముందస్తు ప్రణాళికలు, నూతన అభివృద్ధి పనులు ఫలితం.
– అధికార యంత్రాంగం సమన్వయమే విజయానికి మూలం: మంత్రి సీతక్క.

జనం వాయిస్, మేడారం, ఫిబ్రవరి 1:

మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఈ ఏడాది అత్యంత ఘనంగా, చరిత్రలో నిలిచిపోయే విధంగా విజయవంతంగా ముగిసిందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. కోట్లాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యాలు ఎదుర్కోకుండా తల్లులను ప్రశాంతంగా దర్శించుకోవడం ప్రభుత్వ యంత్రాంగం సాధించిన గొప్ప విజయమని ఆమె పేర్కొన్నారు. తల్లుల వనప్రవేశం అనంతరం మేడారంలోని మీడియా సెంటర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ఈ వివరాలు వెల్లడించారు. జాతర నిర్వహణకు ముందే రూపొందించిన సమగ్ర ప్రణాళికలు, స్పష్టమైన వ్యూహాలు, శాఖల మధ్య సమన్వయంతో చేపట్టిన ఏర్పాట్లు పూర్తిస్థాయిలో ఫలించాయని మంత్రి సీతక్క తెలిపారు. రవాణా సౌకర్యాలు, వైద్య సేవలు, తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, విద్యుత్, అగ్నిమాపక, పోలీస్ భద్రత వంటి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయడం వల్ల జాతర ఎక్కడా అంతరాయం లేకుండా సాగిందని వివరించారు. ఈ ఏడాది జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నూతనంగా చేపట్టిన అభివృద్ధి పనులు నిలిచాయని మంత్రి పేర్కొన్నారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణాలను మరింత సౌకర్యవంతంగా, శోభాయమానంగా తీర్చిదిద్దడం వల్ల భక్తులకు మెరుగైన అనుభూతి లభించిందని తెలిపారు. గద్దెల పరిసరాల్లో విస్తరణ, పాదచారులకు అనుకూల మార్గాలు, శాశ్వత మౌలిక వసతులు జాతర ప్రతిష్టను మరింత పెంచాయని అన్నారు. సంప్రదాయం–ఆధునిక సదుపాయాలు సమన్వయమై మేడారం మహాజాతరకు మరింత శోభ చేకూరిందని మంత్రి సీతక్క తెలిపారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా చేపట్టిన ఈ అభివృద్ధి పనులు మేడారం చారిత్రక ప్రాధాన్యతను మరింత బలపరుస్తాయని ఆమె పేర్కొన్నారు. ఈ మహాజాతరను విజయవంతం చేయడంలో అహర్నిశలు కృషి చేసిన జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, స్వచ్ఛంద సేవకులు, సహకరించిన ప్రతి ఒక్కరికీ మంత్రి సీతక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గుడి అభివృద్ధి పనులు ప్రారంభమైన నాటి నుంచి కొన్ని శక్తులు దుష్ప్రచారం చేశాయని, జాతర సందర్భంగా కూడా సోషల్ మీడియా వేదికగా గందరగోళం సృష్టించే ప్రయత్నాలు జరిగాయని మంత్రి పేర్కొన్నారు. అయితే భక్తులు వాటిని తిప్పికొట్టి తల్లుల సేవలో తరించారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో యుద్ధప్రాతిపదికన వంద రోజుల్లోనే మేడారం అభివృద్ధి పనులను పూర్తి చేశామని, మేడారం చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిలో నిలిచిపోతుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన మంత్రివర్గ సహచరులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. భక్తుల సహనం, సహకారం వల్లే మేడారం జాతర ఇంత ఘనంగా విజయవంతమైందని పేర్కొంటూ, సమ్మక్క–సారలమ్మ ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సుఖసంతోషాలు, సమృద్ధి కలగాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు.