janamvoice.com
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 12:00 pm Digital Edition : JANAM VOICE

మంత్రి కొండా సురేఖ కు పదవీ గండం..

మంత్రి కొండా సురేఖ కు పదవీ గండం..

జనం వాయిస్, వరంగల్, ఆగస్టు 22:

కొండా సురేఖ మంత్రి పదవి తొలగింపుపై రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. కొండా సురేఖ కుటుంబానికి వ్యతిరేకంగా అందరూ ఒక్కటయ్యారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొండా సురేఖ కుటుంబ వ్యవహార శైలిపై పార్టీ హైకమాండ్ కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది. అయితే కొండా సురేఖ మీద చర్యలు తీసుకుంటే కట్టుబాటు తప్పిన మిగిలిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే బీసీ కార్డుతో కొండా సురేఖ పార్టీని ఇరకాటంలోకి పెట్టే అవకాశముంది. అందుకే కొండా సురేఖ వ్యవహారాన్ని పరిశీలిస్తున్న నాయకత్వం ఏదో ఒక చర్య మాత్రం తీసుకోవాలని చూస్తుంది.. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పరకాల సభలో సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన విమర్శలు వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘం సురేఖకు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. కొండా సురేఖను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు ఆ వ్యాఖ్యలు తన కుమార్తె వ్యక్తిగతమని, తనకూ వాటికి సంబంధం లేదని కొండా సురేఖ స్పష్టం చేస్తూ క్రమశిక్షణా సంఘానికి లేఖ రాశారు.మంత్రి పదవి నుంచి తొలగిస్తారా లేదా అనే అంశంపై పార్టీ హైకమాండ్ మరియు సీఎం రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయంపై స్పష్టత రావాల్సి ఉంది. దళిత ఎమ్మెల్యేను అవమానపర్చిన సమయంలోనూ, ఇతర సామాజికవర్గం నేతలను కించపర్చినప్పుడు ఒక్కటవ్వని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొండా సురేఖ విషయంలో ఒక్కటవ్వడంపై కొంత వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశముంది కానీ కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలంటే అందుకు కొంత పార్టీ సాహసం చేయాల్సి ఉంటుంది. మిగిలిన క్రమశిక్షణ తప్పిన రెడ్డి సామాజికవర్గం ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డితో పాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోకుండా కొండా సురేఖపై చర్యలు తీసుకుంటే అవి తప్పుడు సంకేతాలు వెళతాయి. తెలంగాణలో బలమైన బీసీ సామాజికవర్గంలో వ్యతిరేకత వస్తే అది రాజకీయంగా ఇబ్బందిగా మారుతుంది. అందుకే కొండా సురేఖ పై చర్యలు అంత సులువు కాదు. కాకుంటే ఇకపై ఎలాంటి దూకుడు గా వ్యవహరించకుండా కొంత కళ్లెం వేయవచ్చన్న అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. కొండా సురేఖకు వ్యతిరేకంగా పదహారు మంది ఎమ్మెల్యేలు సీఎల్పీలో సమావేశమయ్యారు. కొందరు లోపాయికారీగా కొండాసురేఖకు మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తోంది. మరి కొండా వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందన్నది చూడాలి.