పదవి బాధ్యతలు స్వీకరించిన సర్పంచులు, వార్డు సభ్యులకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు.
-బాధ్యతాయుతంగా పనిచేయాలి
ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుంది.
జనం వాయిస్, హైదరాబాద్, డిసెంబర్ 22:
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందుతూ నేడు పదవి బాధ్యతలు స్వీకరించిన నూతన సర్పంచులు, వార్డు సభ్యులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల నమ్మకంతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలను గౌరవంగా నిర్వర్తించాలని హితవు పలికారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన లక్ష్యంగా పనిచేయాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. గ్రామ ప్రజాస్వామ్యానికి బలం చేకూర్చే విధంగా సర్పంచులు, వార్డు సభ్యులు తమ పాత్రను సమర్థవంతంగా పోషించాలని సూచించారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపే నాయకత్వం అవసరమని ఆమె పేర్కొన్నారు. గ్రామాలే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని స్పష్టం చేసిన మంత్రి, సర్పంచులు మరియు వార్డు సభ్యులు సమిష్టిగా పనిచేసినప్పుడే పల్లె ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు. పరస్పర సమన్వయంతో ముందుకు సాగితేనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తుందని మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు. ప్రజాప్రతినిధులు ఎలాంటి సంకోచం లేకుండా ధైర్యంగా ముందుకు సాగాలని సూచిస్తూ, ప్రభుత్వం ఎల్లవేళలా మీ వెంటే ఉంటుందని స్పష్టం చేశారు.