హైదరాబాద్ శివార్లలో తల్లీబిడ్డల ఆత్మహత్య.
– కుటుంబ, ఆస్తి గొడవల కోణంలోనూ కొనసాగుతున్న దర్యాప్తు.
– ఒంటరితనమే ప్రధాన కారణమని ప్రాథమిక నిర్ధారణ.
– సూసైడ్ నోట్, సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్ స్వాధీనం.
– ఫోరెన్సిక్ విశ్లేషణతో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం.
జనం వాయిస్, హైదరాబాద్, ఫిబ్రవరి 2:
హైదరాబాద్ శివార్లలో జరిగిన తల్లీబిడ్డల ఆత్మహత్య ఘటనలో క్రమంగా కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చర్లపల్లి–ఘట్‌కేసర్ రైల్వే ట్రాక్‌పై ఐటీ ఉద్యోగిని విజయరెడ్డి తన ఇద్దరు పిల్లలు చేతన, విశాల్‌తో కలిసి బలవన్మరణానికి పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ దారుణానికి ఆమెను వెంటాడిన తీవ్ర ఒంటరితనమే ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఉప్పల్ రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన విజయరెడ్డికి 2007లో సురేందర్‌రెడ్డితో వివాహమైంది. భర్త నాలుగేళ్లుగా దుబాయ్‌లో ఉద్యోగం చేస్తుండటంతో ఆమె తల్లితో కలిసి నివసిస్తూ, నగరంలోని ఓ ఐటీ సంస్థలో టీమ్ లీడర్‌గా పనిచేస్తున్నారు. నైట్ షిఫ్టుల కారణంగా ఇద్దరు పిల్లలను హాస్టల్‌లో ఉంచి చదివించాల్సి వచ్చింది. భర్త దూరంగా ఉండటం, పిల్లలు కూడా దగ్గర లేకపోవడంతో గత 15 రోజులుగా ఆమె తీవ్ర ఒంటరితనానికి లోనై, స్నేహితులు, బంధువుల వద్ద తన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. శనివారం తెల్లవారుజామున హాస్టల్ నుంచి పిల్లలను కారులో తీసుకువచ్చిన విజయరెడ్డి, చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద కారు నిలిపారు. అక్కడ పార్కింగ్ స్లిప్ వెనుక భాగంలో “నాకు బతకాలని లేదు. నేను లేకపోతే పిల్లలు అనాథలవుతారు. అందుకే నాతో పాటే తీసుకెళ్తున్నా” అంటూ సూసైడ్ నోట్ రాశారు. ఆ నోట్‌ను ఫొటో తీసి వాట్సప్ స్టేటస్‌గా కూడా పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం పిల్లలతో కలిసి గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటన స్థలంలో ఉన్న కారు నుంచి సూసైడ్ నోట్‌తో పాటు విజయరెడ్డి సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించారు. ఆత్మహత్యకు ముందు ఆమె ఎవరితో మాట్లాడింది, చాటింగ్ వివరాలు, కాల్ డేటా వంటి అంశాలపై లోతుగా విచారణ చేస్తున్నారు. కుటుంబ కలహాలు లేదా ఆస్తి వివాదాల కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.