క్రికెట్ ఆడొద్దని తల్లి మందలింపు..తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్య.
జనం వాయిస్, మంచిర్యాల:
మంచిర్యాల జిల్లా దండేపల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న న్యాలం ఆకర్ష్ (14) అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.వివరాల ప్రకారం.. క్రికెట్ ఆడుకోవడానికి వెళ్లొద్దని, హోంవర్క్ చేసుకోవాలని తల్లి శ్రీదేవి బాలుడిని మందలించారు. ఈ మందలింపును తీవ్రంగా తీసుకున్న ఆకర్ష్ క్షణికావేశానికి లోనై ఇంట్లోని బెడ్‌రూంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అనంతరం ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఎంతోసేపటికీ తలుపులు తెరవకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానంతో తలుపులు పగలగొట్టి చూడగా బాలుడు ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ ఘటనతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాలుడి ఆత్మహత్య స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.