janamvoice.com
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 5:33 pm Digital Edition : JANAM VOICE

మేజిక్‌ రాజాకు జాతీయ అవార్డు.

మేజిక్‌ రాజాకు జాతీయ అవార్డు.

  • ‘బెస్ట్‌ మైండ్‌ పవర్‌ మోటివేషనల్‌ స్పీకర్‌’గా సన్మానం.
  • తెలంగాణ సైకలాజికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అవార్డు ప్రదానం.
  • మానసిక వికాసంపై విద్యార్థులకు ప్రేరణాత్మక కార్యక్రమాలు.
  • బహుముఖ కళాకారుడిగా మేజిక్‌ రాజా సేవలు.

జనం వాయిస్, గోదావరిఖని, అక్టోబర్‌ 8:

స్థానిక ప్రముఖ ఇంద్రజాలికుడు, ప్రేరణాత్మక వక్త మేజిక్‌ రాజాకు జాతీయస్థాయి అవార్డు లభించింది. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ సైకలాజికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌ నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల సెమినార్‌ హాల్‌లో డాక్టర్‌ బీవీ పట్టాభిరామ్‌ స్మారక జాతీయ అవార్డులు–2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేజిక్‌ రాజాను తెలంగాణ సైకలాజికల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు, కార్యక్రమ ముఖ్య సమన్వయకర్త, ప్రముఖ మానసిక నిపుణులు డాక్టర్‌ ఎంఏ కరీం ఘనంగా సన్మానించి ‘బెస్ట్‌ మైండ్‌ పవర్‌ మోటివేషనల్‌ స్పీకర్‌’ జాతీయ అవార్డును అందజేశారు. మేజిక్‌ రాజా ఇంద్రజాలికుడిగానే కాకుండా మిమిక్రీ, మూకాభినయం, వెంట్రిలాక్విజం కళాకారుడిగా, నటుడిగా, వ్యాఖ్యాతగా, పాత్రికేయుడిగా, వార్తా పఠనకుడిగా, ప్రేరణాత్మక వక్తగా బహుముఖ ప్రతిభను చాటుతున్నారు. నాడీ భాషా కార్యక్రమం, జీవన విద్యలో శిక్షణ పొందిన ఆయన పలు పాఠశాలల్లో విద్యార్థులకు జ్ఞాపకశక్తి పద్ధతులు, పఠన నైపుణ్యాలు, సానుకూల ఆలోచన, లక్ష్య సాధన వంటి అంశాలపై ప్రేరణాత్మక ప్రసంగాలు అందిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు వేదికలపై వ్యాఖ్యాతగా, కళాకారుడిగా కార్యక్రమాలు నిర్వహిస్తూ మానసిక ఉల్లాసం, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆయన అందిస్తున్న సేవలను గుర్తించిన తమ సంఘం ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు డాక్టర్‌ ఎంఏ కరీం తెలిపారు. కార్యక్రమం అనంతరం మేజిక్‌ రాజా ప్రదర్శించిన ‘మాట్లాడే బొమ్మ’ ప్రత్యేక ప్రదర్శన సభికులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ చంద్రా ముఖర్జీ, డాక్టర్‌ జీ. రాజేశ్వర్‌రావు, డాక్టర్‌ టి. అంజనామూర్తి, డాక్టర్‌ రాహతుల్లా, డాక్టర్‌ గర్రె శంకర్‌రావు, డాక్టర్‌ సుబ్బారెడ్డి, డాక్టర్‌ అనితాజ్యోతి, డాక్టర్‌ ఆజం అలీ, డాక్టర్‌ భాగ్యవతి, సీనియర్‌ ఇంద్రజాలికులు ఎన్‌ఆర్‌ కరెంట్‌, మధుబాల, ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు. మేజిక్‌ రాజా జాతీయస్థాయి అవార్డు అందుకోవడం పట్ల ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా మెజీషియన్స్‌ అసోసియేషన్‌ సభ్యులు, స్థానిక కళాకారులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.