రవితేజ నా బెస్ట్ ఫ్రెండ్.. ఎన్టీఆర్ డ్యాన్స్‌కు సాటి లేరు: నయనతార..
జనం వాయిస్, సినిమా , మే 15:
దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా దాదాపు రెండు దశాబ్దాలుగా తన హవా కొనసాగిస్తున్న నయనతార, టాలీవుడ్ హీరోల గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, హీరో రవితేజతో తన స్నేహం, అలాగే జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ ప్రతిభ గురించి పలు విషయాలను పంచుకున్నారు. రవితేజ ఒకప్పుడు తనకు అత్యంత సన్నిహితుడని, బెస్ట్ ఫ్రెండ్‌లా ఉండేవారని నయనతార తెలిపారు. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉండటంతో తరచూ కలుసుకునే అవకాశం లేకపోయినా, తమ మధ్య ఉన్న స్నేహబంధం మాత్రం ఇప్పటికీ అలాగే కొనసాగుతోందని చెప్పారు. రవితేజతో తమకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉందని, ఇద్దరూ ఎక్కువగా హిందీలో మాట్లాడుకునేవారమని నయనతార వెల్లడించారు. రవితేజకు అమితాబ్ బచ్చన్ అంటే ఎంతో అభిమానం ఉండేదని, ఆయన హిందీని చాలా చక్కగా మాట్లాడతారని తెలిపారు. సినిమా షూటింగ్‌ల సమయంలో హిందీలో మాట్లాడటం అలవాటై, ఆ సంభాషణల వల్ల తమ మధ్య స్నేహం మరింత బలపడిందని పేర్కొన్నారు.
సినీ పరిశ్రమలో తాను కలిసి పనిచేసిన ప్రతి హీరో, దర్శకుడు, సాంకేతిక నిపుణులను కుటుంబ సభ్యుల్లా భావిస్తానని నయనతార చెప్పారు. సినిమాల్లో కలిసి పనిచేయడం కేవలం వృత్తిపరమైన సంబంధంగా కాకుండా, భావోద్వేగ అనుబంధంగా మారుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ, తన కెరీర్‌లో రిహార్సల్స్ చేయకుండా నేరుగా సెట్స్‌లోకి వచ్చి ఒక్క టేక్‌లో డ్యాన్స్ చేసే హీరోను తాను చూడలేదని, ఆ ప్రత్యేకత ఎన్టీఆర్‌కే సొంతమని ప్రశంసించారు. డ్యాన్స్ మాస్టర్ చూపించిన కఠినమైన స్టెప్పులను కూడా తారక్ ఒక్కసారి చూసి అద్భుతంగా చేసి చూపిస్తారని తెలిపారు. షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ చాలా చురుకుగా, సరదాగా ఉంటారని గుర్తుచేసుకున్న నయనతార, ఒకసారి తాను టచ్‌అప్ చేసుకుంటుండగా “ఎంత టచ్‌అప్ చేసుకున్నా తెరపై అందరూ నన్నే చూస్తారు” అంటూ ఎన్టీఆర్ సరదాగా కామెంట్ చేశారని నవ్వుతూ చెప్పారు. ఆయన చాలా ముద్దుగా, అందరితో కలిసిపోయే వ్యక్తి అని కొనియాడారు. నయనతార చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి.