janamvoice.com
Newspaper Banner
Date of Publish : 09 April 2026, 4:13 pm Digital Edition : JANAM VOICE

సింహాచలం దేవస్థానంలో ‘సమాచార’ నిర్లక్ష్యం.

  • సింహాచలం దేవస్థానంలో ‘సమాచార’ నిర్లక్ష్యం .
  • దేవాదాయ, ధర్మాదాయ కమిషనర్ ఆదేశాలు బేఖాతరు.
  • రాష్ట్ర సమాచార కమిషన్‌కు ఫిర్యాదు.
  • ఆభరణాల రిజిస్ట్రర్ తనిఖీల నివేదిక బహిర్గతం చేయాలి.
  • ఆర్టీఐ ప్రభావితులు, ఉద్యమకర్త కాండ్రేగుల వెంకటరమణ డిమాండ్.

జనం వాయిస్, విశాఖపట్నం :

సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం సాక్షిగా రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన శ్రీ వరహా నరసింహా స్వామి (సింహాచలం) దేవస్ధానంలో పారదర్శకత, జవాబుదారీతనం కొరవడింది. దరఖాస్తుదారునికి ఆర్టీఐ చట్టం ప్రకారం ఇవ్వదగ్గ సమాచారం అందజేయాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం జారీ చేసిన ఆదేశాలను దేవస్ధాన అధికార యంత్రాంగం బేఖాతరు చేసింది. భక్తి భావంతో విరాళాలు ఇచ్చే భక్తులకు, దేవస్థాన పరిపాలనలో పారదర్శకత ఉండాలని కోరుకునే సామాన్యులకు ఈ వ్యవహారం మింగుడు పడటం లేదు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆర్టీఐ, వినియోగదారుల రక్షణ చట్టాల ప్రభావితులు, ఉద్యమకర్త కాండ్రేగుల వెంకటరమణ సోమవారం విలేఖర్లకు వివరించారు. సింహాచలం దేవస్ధానంకు సంబంధించి వెండి, బంగారం, వివిధ రకాల ఆభరణాల లెక్కల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించి 2014 నుంచి సమాచారం ఇచ్చు తేదీ వరకు జరిగిన తనిఖీల నివేదికలు, తనిఖీ కమిటీల నియామక ఉత్తర్వులు, వెండి, బంగారం, వివిధ రకాల ఆభరణాలకు సంబంధించి తాజా పరిచిన రిజిస్టర్ కాపీ, 2014 నుంచి సమాచారం ఇచ్చు తేదీ వరకు ఆభరణాల రిజిస్ట్రర్ తనిఖీల నివేదికలు, ఆభరణాలను భద్రపరుచు నియమనిబంధనలు, ఆభరణాల లెక్కల్లో అవకతవకలు జరిగాయని కె.ప్రభాకరచారి ఫిర్యాదుపై తీసుకున్న చర్యలు, నివేదికలు, రోజు వారీ ప్రగతి నివేదికలు, నోట్ ఫైల్స్, మార్జిన్ నోటింగ్స్, ఉత్తరప్రత్యుత్తరాలు, చర్యలు తీసుకోవాల్సిన అధికారి/ఉద్యోగి పేరు, ీVAదా, ఫిర్యాదు పరిష్కరించు కాలవ్యవధి ఫిర్యాదు ప్రస్తుత స్టేటస్, సింహాచలం దేవస్ధానం ఆడిట్ రిపోర్ట్‌లలో వెల్లడైన అభ్యంతరాలు, ఆ అభ్యంతరాలపై ఇచ్చిన సమాధానాలు, పెండింగ్‌లో ఉన్న ఆడిట్ ఆభ్యంతరాలు కాపీలు, దేవస్ధానం జమలు, ఖర్చులు మొదలగు 16 కీలక వివరాలను కోరుతూ ఆర్టీఐ ఉద్యమకర్త కాండ్రేగుల వెంకటరమణ ఆర్టీఐ సెక్షన్ 6 (1) ప్రకారం 2025 అక్టోబర్ 7న, ఆర్టీఐ సెక్షన్ 19 (1) ప్రకారం 2025 నవంబర్ 11న మొదటి అప్పీలు దేవాదాయ, ధర్మాదాయ రాష్ట్ర కమిషనర్ కార్యాలయానికి దరఖాస్తు చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ కమిషనర్ కార్యాలయం ఆర్టీఐ చట్టప్రకారం ఇవ్వదగ్గ సమాచారాన్ని తక్షణం దరఖాస్తుదారునికి అందజేయాలని దేవస్థానం అధికారులకు  రెండు ఉత్తర్వులు (ఆర్‌సీ నెం. యు1/సీఒఇ`21022/15/2025 తేది : 16-10-2025, సి.నెం. యు2/11454868/2025 తేది : 24-12-2025) జారీ చేసింది.

మూడు నెలలు దాటినా ముందడుగు లేదు.                                                              అయితే ఆదేశాలు వెలువడి మూడు నెలలు దాటినా సింహాచలం దేవస్థానం యంత్రాంగం నుండి ఎటువంటి స్పందన లేదు. సమాచారాన్ని ఇవ్వడంలో జాప్యం చేయడం వెనుక అంతర్యం ఏమిటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాలనే తుంగలో తొక్కడంపై సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమాచారాన్ని పంపిస్తారా లేక ఈ ఫైలు ఇలాగే పెండింగ్‌లో పడుతుందో వేచి చూడాలి. రాష్ట్ర సమాచార కమిషన్‌కు ఫిర్యాదు దేవస్థానం అధికారుల మొండి వైఖరిని నిరసిస్తూ న్యాయమైన సమాచారం ఇప్పించాలని కోరుతూ కాండ్రేగుల వెంకటరమణ తాజాగా రాష్ట్ర సమాచార కమిషన్‌లో రెండో అప్పీలు దాఖలు చేశారు. చట్టాన్ని గౌరవించని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ‘ప్రజాస్వామ్యంలో సమాచారాన్ని దాచడం అంటే అవినీతికి ద్వారాలు తెరవడమే. కమిషనర్ ఆదేశాలను కూడా అమలు చేయకపోవడం శాఖా పరమైన క్రమశిక్షణా రాహిత్యమే అవుతుంది.’ అని ఆయన అన్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికార యంత్రాంగం ఆర్టీఐ చట్టం పరిధిలోకి వస్తుందని వెంకటరమణ స్పష్టం చేశారు.