బొకేలు వద్దు… బ్లాంకెట్లు ఇవ్వండి: మంత్రి సీతక్క పిలుపు.
– నూతన సంవత్సరంలో మానవత్వమే గొప్ప కానుక.
– చలిలో పేదలకు రక్షణగా దుప్పట్లు ఉపయోగపడతాయి.
జనం వాయిస్, హైదరాబాద్, జనవరి 01:
నూతన సంవత్సరాన్ని ఆర్భాటాలతో కాకుండా మానవత్వంతో ప్రారంభించాలని రాష్ట్ర మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. సచివాలయంలో ఎస్ఈఆర్పీ సీఈవో దివ్య దేవరాజన్ ఆధ్వర్యంలో ఎస్ఈఆర్పీ డైరెక్టర్లు, సిబ్బంది మంత్రి సీతక్కను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పూల బొకేలకు బదులుగా తెలంగాణ నేతన్నలు తయారు చేసిన దుప్పటిని ఆమెకు అందజేశారు. ఈ ఆలోచనను మంత్రి హర్షిస్తూ, మానవీయ విలువలకు ఇది చక్కటి ఉదాహరణగా పేర్కొన్నారు. ఎస్ఈఆర్పీ డైరెక్టర్లు, సిబ్బందిని అభినందించిన మంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎస్ఈఆర్పీ విభాగం ద్వారా పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. బొకేలు క్షణాల్లో వాడుక లేకుండా పోతే, ఒక దుప్పటి మాత్రం చలిలో వణికే పేద విద్యార్థులు, పిల్లలు, వృద్ధులు, కూలీలకు నిజమైన రక్షణగా నిలుస్తుందని ఆమె స్పష్టం చేశారు. “బొకేలు వద్దు… బ్లాంకెట్లు ఇవ్వండి” అంటూ అందరూ ఈ ఆలోచనను ఆచరణలో పెట్టాలని కోరారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రికి తెలియజేయగా ఆయన కూడా సంతోషం వ్యక్తం చేశారని మంత్రి సీతక్క వెల్లడించారు. సచివాలయం ముందు శాలువలు, దుప్పట్లు సులభంగా లభించేలా టెస్కో ద్వారా ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. పేదల చిరునవ్వే నిజమైన నూతన సంవత్సర శుభాకాంక్ష అని, చిన్న సహాయం కూడా పెద్ద మార్పుకు దారి తీస్తుందని మంత్రి సీతక్క అన్నారు.