ఇక ప్రభుత్వ కార్యాలయాలకు ‘టీ-ఫైబర్’ ఇంటర్నెట్ మాత్రమే.
సెప్టెంబర్ ఒకటి తర్వాత ప్రైవేట్ ఆపరేటర్లకు బిల్లులు చెల్లించొద్దు.
ఇంటింటికి ఇంటర్నెట్ అందించే ప్రక్రియను మరింత వేగవంతం చేయండి.
‘టీ – ఫైబర్’ సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించిన మంత్రి శ్రీధర్ బాబు.
జనం వాయిస్, హైదరాబాద్, ఆగష్టు 04:
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ ఒకటి నుంచి కేవలం ‘టీ-ఫైబర్’ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. ఆ గడువు దాటిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ సేవల నిమిత్తం ప్రైవేట్ ఆపరేటర్లకు బిల్లులు చెల్లించొద్దని స్పష్టం చేశారు. మంగళవారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ‘టీ – ఫైబర్’పై అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… టీ-ఫైబర్ నెట్‌వర్క్ వినియోగం ద్వారా ఏటా ప్రభుత్వానికి సుమారు రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు ఆదా అయ్యే అవకాశముందని వెల్లడించారు. అంతేకాకుండా… ఇంట్రానెట్ బేసిస్‌లో సెక్యూర్డ్ ఇంటర్నెట్ యాక్సెస్ కల్పించడం ద్వారా రాష్ట్ర డేటా సెంటర్‌కు అనుసంధానం ఏర్పడి, పూర్తి స్థాయి డేటా సెక్యూరిటీ చేకూరుతుందన్నారు. గత ఆరు నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 4,487 ప్రభుత్వ కార్యాలయాలకు ‘టీ – ఫైబర్’ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఫలితంగా… ప్రభుత్వ ఖజానాకు ఇప్పటికే సుమారు రూ.13 కోట్లు ఆదా అయ్యిందన్నారు. మరిన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఈ సేవలను విస్తరించేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో తలెత్తే లోపాలను ఎప్పటికప్పుడు సరిచేస్తూనే… రాబోయే రోజుల్లోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణ వైడ్ ఏరియా నెట్‌వర్క్(టీ – స్వాన్)ను నెల రోజుల్లోపు పూర్తిస్థాయిలో టీ-ఫైబర్‌కు బదిలీ చేయాలని సంబంధిత అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’కి పూర్తిస్థాయిలో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ‘టీ-ఫైబర్’కు సూచించారు. అలాగే… ఇంటింటికి ఇంటర్నెట్ అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని, దీనికోసం ప్రిన్సిపుల్ మానిటైజేషన్ పార్టనర్‌ను ఎంపిక చేసేందుకు టెండర్లు పిలవాలని దిశా నిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎస్ సంజయ్ జాజు, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, టీ-ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
