janamvoice.com
Newspaper Banner
Date of Publish : 05 January 2026, 10:21 pm Digital Edition : GATTU MAHESH

కోనసీమలో ఓఎన్జీసీ గ్యాస్ లీకేజీ కలకలం – గ్రామం ఖాళీ.

కోనసీమలో ఓఎన్జీసీ గ్యాస్ లీకేజీ కలకలం – గ్రామం ఖాళీ.

– గ్యాస్ లీకేజీతో భారీ మంటలు.
– కొబ్బరి తోటలకు తీవ్ర నష్టం.
– సీఎం చంద్రబాబు ఆదేశాలతో సహాయక చర్యలు.

జనం వాయిస్, మలికిపురం:

కోనసీమ జిల్లాలో తీవ్ర ఆందోళన నెలకొంది. మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఉన్న ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ డ్రిల్లింగ్ కేంద్రంలో భారీ గ్యాస్ లీకేజీ చోటుచేసుకుని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సోమవారం మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఓఎన్జీసీకి చెందిన మోరీ–ఐదు బావి వద్ద గ్యాస్ పైప్‌లైన్ నుంచి ఒక్కసారిగా గ్యాస్ పైకి చిమ్మడంతో మంటలు వ్యాపించాయి. దాదాపు రెండు గంటల పాటు పెద్ద శబ్దాలతో గ్యాస్ లీక్ అవ్వడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పరిస్థితి అదుపు తప్పుతుందన్న ఆందోళనతో గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.ఈ ప్రమాదంలో సమీపంలోని కొబ్బరి తోటలకు మంటలు అంటుకొని విస్తృతంగా నష్టం వాటిల్లింది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఐదు వందలకు పైగా కొబ్బరి చెట్లు పూర్తిగా కాలిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. కొబ్బరి సాగుపై ఆధారపడి జీవించే రైతులకు ఈ ఘటన పెద్ద దెబ్బగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే రెవెన్యూ, పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇరుసుమండ గ్రామాన్ని పూర్తిగా ఖాళీ చేయించడంతో పాటు, చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాజమండ్రి నుంచి ఓఎన్జీసీ ఉన్నతాధికారులు, సాంకేతిక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించారు. మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలని, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంటలను త్వరితగతిన అదుపులోకి తీసుకురావాలని, ఘటనపై ఎప్పటికప్పుడు నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.