janamvoice.com
Newspaper Banner
Date of Publish : 11 April 2026, 9:43 pm Digital Edition : JANAM VOICE

ఏప్రిల్‌ లోనే మే ఎండలు..పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు.

ఏప్రిల్‌ లోనే మే ఎండలు

– తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతోంది
– పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు
– ప్రజలు ఆందోళన
– 41-42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవకాశం
– వడదెబ్బల నుంచి రక్షణకు జాగ్రత్తలు సూచించిన అధికారులు

జనం వాయిస్, హైదరాబాద్, ఏప్రిల్ 11:

తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. గత నెల నుంచే భానుడు మండిపోతుండగా, ఏప్రిల్‌లోనే మే నెల వాతావరణాన్ని తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచే ఉక్కపోత, మధ్యాహ్నం వడగాల్పులతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల మేర గరిష్ఠ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. రాబోయే 4 నుంచి 5 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లాలో 41 డిగ్రీలు, ఖమ్మంలో 40 డిగ్రీలు నమోదయ్యాయి. ఉత్తర తెలంగాణలో కూడా 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ నగరంలో కూడా 39 డిగ్రీల ఉష్ణోగ్రత కొనసాగుతోంది. ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన జిల్లాల్లో నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట, మహబూబ్ నగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో 41 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. వృద్ధులు, చిన్నపిల్లలు ఈ ఎండలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటల తర్వాతే రహదారులు వెలవెలబోతున్నాయి. ప్రజలు అత్యవసర పనులు తప్ప బయటకు రావడాన్ని తగ్గిస్తున్నారు. వడదెబ్బల నుంచి రక్షణ కోసం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగకుండా ఉండాలని అధికారులు సూచించారు. మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలని, తరచుగా నీరు తాగాలని సూచించారు. తలనొప్పి, తల తిరగడం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని హెచ్చరించారు.