అవినీతి నిరోధక శాఖ వలలో పంచాయతీ అధికారులు.
– ఇంటి నిర్మాణ అనుమతుల పేరుతో రూ.2.50 లక్షల డిమాండ్.
– రూ.లక్ష లంచం స్వీకరిస్తూ పట్టుబాటు.
– ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని అనిశా స్పష్టం.
జనం వాయిస్, రంగారెడ్డి జిల్లా:
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని ఎదులపల్లి గ్రామంలో ఇంటి నిర్మాణ అనుమతుల పేరుతో లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తూ ముగ్గురు అధికారులు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులకు చిక్కారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి పొన్న సుమతి, మండల పంచాయతీ అధికారి వడ్త్యావత్ తేజ్ సింగ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆవుల చెన్నయ్యలు కలిసి ఫిర్యాదుదారుని నుంచి రూ.2 లక్షల 50 వేల లంచం డిమాండ్ చేసినట్లు అనిశా అధికారులు వెల్లడించారు. ఫిర్యాదుదారునికి చెందిన నాలుగు ప్లాట్లలో ఇంటి నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాల్సి ఉండగా, దానికి సంబంధించి దరఖాస్తు రుసుము ఇప్పటికే చెల్లించినప్పటికీ, తదుపరి ప్రక్రియ పూర్తి చేసి అనుమతులు జారీ చేయాలంటే లంచం ఇవ్వాలంటూ అధికారులు ఒత్తిడి చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో రూ.లక్ష లంచం తీసుకుంటున్న సమయంలో ముగ్గురు అధికారులు అనిశా అధికారులకు పట్టుబడ్డారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అనిశా అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ సేవకులు లంచం అడిగినట్లయితే ప్రజలు వెంటనే అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని సూచించారు. వాట్సాప్ నెంబర్ 9440446106, ఫేస్‌బుక్, అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారులు, బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని అనిశా అధికారులు మరోసారి భరోసా ఇచ్చారు.