janamvoice.com
Newspaper Banner
Date of Publish : 27 January 2026, 9:02 am Digital Edition : GATTU MAHESH

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి: కోదండరాం సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి: కోదండరాం సంచలన వ్యాఖ్యలు

అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామన్న ప్రకటన.
మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమన్న స్పష్టం.
కాంగ్రెస్‌తో పొత్తుపై ఇంకా నిర్ణయం లేదని వివరణ.
సింగరేణి పరిరక్షణకు ఉద్యమ స్ఫూర్తి అవసరం.

జనం వాయిస్, హైదరాబాద్:

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి నెలకొన్నాయని పేర్కొన్నారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల విషయంలో తమ పార్టీ వైఖరిని అధికార పార్టీకి ఇప్పటికే తెలియజేశామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ జన సమితి నిర్ణయించుకున్నదని కోదండరాం వెల్లడించారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల అంశంపై కాంగ్రెస్ పార్టీని సంప్రదించామని, ఆ పార్టీ నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని చెప్పారు. అయితే తమ పార్టీ మాత్రం ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డపై ఉందని కోదండరాం ఉద్ఘాటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సింగరేణిని కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లనివ్వబోమని స్పష్టంగా చెప్పారు. తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడినేనని వెల్లడించారు. అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేసిన సమయంలో భయం లేని వారికి, ఇప్పుడు విచారణ వస్తే ఎందుకు భయం వేస్తోందని ప్రశ్నించారు. అమరవీరుల త్యాగాలతో సాధించిన తెలంగాణలో ప్రజలు పదేళ్లపాటు అధికారమిచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని కోదండరాం విమర్శించారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం తప్ప రాష్ట్ర ప్రజలకు లాభం చేకూరలేదని దుయ్యబట్టారు. ప్రజా సమస్యల పరిష్కారంలో తెలంగాణ జన సమితి కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయని కోదండరాం తెలిపారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు ముగింపు పలకడం, ఉద్యమ ఆకాంక్షల సాధనకు ఒక అవకాశం ఇవ్వడం, ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండాలన్న ఆశయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చామని ఆయన వివరించారు.