ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్లు, బీడీలు, పాన్‌మసాలా ధరలు పెంపు.
జనం వాయిస్, న్యూఢిల్లీ-జనవరి 1:
సామాన్యులపై మరో భారం పడనుంది. సిగరెట్లు, బీడీలు, పాన్‌మసాలా ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ఉత్పత్తులపై ప్రస్తుతం అమల్లో ఉన్న పన్నులతో పాటు అదనపు సుంకాలు విధించనుండటంతో ఫిబ్రవరి 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. పొగాకు వినియోగాన్ని తగ్గించడంతో పాటు ఆరోగ్యపరమైన నష్టాలను నియంత్రించాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం పాన్‌మసాలా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై అధిక శాతం పన్నులు విధించనున్నారు. బీడీలపై కూడా ప్రత్యేకంగా పన్ను భారం పెరుగనుంది. అంతేకాకుండా పాన్‌మసాలాపై కొత్తగా ఆరోగ్య, జాతీయ భద్రత పేరుతో ప్రత్యేక సెస్ అమలు చేయనున్నారు. గతంలో ఉన్న పరిహార సెస్ స్థానంలో ఈ కొత్త సెస్ అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. దీంతో పాన్‌మసాలా ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇదే సమయంలో చూయింగ్ పొగాకు, జర్దా, గుట్కా వంటి ఉత్పత్తుల తయారీకి ఉపయోగించే యంత్రాలపై కూడా కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. యంత్రాల సామర్థ్యాన్ని బట్టి సుంకాలు వసూలు చేసే విధానాన్ని మరింత కఠినతరం చేశారు. దీని వల్ల తయారీదారులపై అదనపు భారం పడనుండగా, ఆ భారాన్ని వినియోగదారులపై మళ్లించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మార్పులకు సంబంధించిన బిల్లులను డిసెంబర్ నెలలోనే పార్లమెంట్ ఆమోదించింది. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ నిర్ణయాలతో పొగాకు ఉత్పత్తుల వినియోగం తగ్గుతుందని, ప్రజారోగ్య పరిరక్షణకు ఇది దోహదపడుతుందని కేంద్రం భావిస్తోంది. అయితే ధరల పెంపుతో చిరు వ్యాపారులు, తక్కువ ఆదాయ వర్గాలపై ప్రభావం పడే అవకాశం ఉందని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.