కూలిన ప్రైవేట్ శిక్షణ విమానం..కెప్టెన్, ట్రైనీ పైలట్‌కు గాయాలు.
– ఇంజిన్‌లో సాంకేతిక లోపంతో ప్రమాదం.
– పొలంలో కూలిన విమానం.
– దర్యాప్తు చేపట్టిన ఏవియేషన్ అధికారులు.
జనం వాయిస్, బెంగళూరు, ఫిబ్రవరి 8:
కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లాలో ప్రైవేట్ శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది. విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో అది కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని కెప్టెన్, ట్రైనీ పైలట్ గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం రెడ్ బర్డ్ ఏవియేషన్‌కు చెందిన ప్రైవేట్ శిక్షణ విమానం కలబురగి నుంచి బెళగావికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆకాశంలో ఎగురుతున్న సమయంలో ఇంజిన్‌లో అకస్మాత్తుగా సమస్య ఏర్పడినట్లు ప్రాథమిక సమాచారం. ఇంజిన్‌లో లోపం తలెత్తిన వెంటనే పైలట్లు విమానాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించినప్పటికీ, విజయపుర జిల్లా మంగళూరు గ్రామ పరిధిలోని పొలంలో విమానం కూలిపోయింది. ఈ ఘటనలో కెప్టెన్, ట్రైనీ పైలట్‌కు గాయాలు కాగా, స్థానికులు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్‌లో వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన బాబలేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై ఏవియేషన్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. విమాన భద్రత, సాంకేతిక లోపాలపై సమగ్రంగా విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.