janamvoice.com
Newspaper Banner
Date of Publish : 30 January 2026, 2:58 pm Digital Edition : GATTU MAHESH

మినీ మేడారం జాతరలో ఎమ్మెల్యే అక్రమ అరెస్ట్‌పై స్పీకర్‌కు ప్రివిలైజ్ మోషన్.

మినీ మేడారం జాతరలో ఎమ్మెల్యే అక్రమ అరెస్ట్‌పై స్పీకర్‌కు ప్రివిలైజ్ మోషన్.

– దానం నాగేందర్‌పై వెంటనే అనర్హత వేటు వేయాలని డిమాండ్.
– పోలీస్ యంత్రాంగం దుర్వినియోగమైందని ఆరోపణ.
– బీజేపీ–కాంగ్రెస్ మధ్య తెరవెనుక ఒప్పందాలున్నాయన్న విమర్శ.

జనం వాయిస్, హైదరాబాద్:

వీణవంక మండలంలో నిర్వహించిన మినీ మేడారం సమ్మక్క–సారక్క జాతర సందర్భంగా తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, ఈ ఘటనపై గౌరవ స్పీకర్‌కు ప్రివిలైజ్ మోషన్ సమర్పించినట్లు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెల్లడించారు. ప్రజలతో కలిసి ఆదివాసీ దేవతల పవిత్ర జాతరలో పాల్గొంటున్న సమయంలో ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా, చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తూ పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధమని వ్యాఖ్యానించారు. అధికార పార్టీ ఒత్తిడితోనే పోలీస్ యంత్రాంగం పనిచేసిందని ఆరోపించిన కౌశిక్ రెడ్డి, కరీంనగర్ జిల్లా సీపీ, ఏసీపీ, సీఐలు కలిసి తనపై అక్రమ చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యుడి గౌరవాన్ని దెబ్బతీసేలా ఈ ఘటన జరిగిందని, ఇది శాసనసభ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్‌కు ప్రివిలైజ్ మోషన్ ఇచ్చామని తెలిపారు. పవిత్రమైన సమ్మక్క–సారక్క జాతరను రాజకీయ ప్రయోజనాల కోసం భంగపెట్టడం అత్యంత దుర్మార్గమైన చర్య అని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. అధికార పార్టీ అండదండలతో కరీంనగర్ సీపీ, హుజురాబాద్ ఏసీపీ, జమ్మికుంట రూరల్ సీఐలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఎమ్మెల్యే హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు చట్టప్రకారం సంబంధిత అధికారులకు గట్టి బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
అదే విధంగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై ఈరోజు విచారణకు తాను హాజరయ్యానని, అయితే పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, అలాగే విచారణ ఎదుర్కొంటున్న దానం నాగేందర్ హాజరుకాకపోవడం గమనార్హమని తెలిపారు. దీనివల్ల బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య తెరవెనుక రాజకీయ ఒప్పందాలు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్నాయని విమర్శించారు. దానం నాగేందర్‌తో పాటు మరో పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని, ఉప ఎన్నికలు రావడం ఖాయమని స్పష్టం చేస్తూ, రాష్ట్రంలో కొంతమంది అధికారులు బీఆర్ఎస్ నాయకులను వేధించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.