వన్యప్రాణులు, పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకం.
- మంథని అటవీ రేంజ్ అధికారి ఎం. వినయ్ నాయక్.
- పారుపల్లి పెద్ద చెరువు వద్ద బర్డ్ వాక్, వన్యప్రాణుల అవగాహన కార్యక్రమం నిర్వహణ.
- జీవ వైవిధ్య పరిరక్షణతోనే ప్రకృతి సమతుల్యత సాధ్యం.
- గ్రామస్తులు, యువతకు బర్డ్ వాచింగ్, ట్రెక్కింగ్ ద్వారా పర్యావరణ అవగాహన.
- జనం వాయిస్, పెద్దపల్లి, జూన్ 06:
- ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా వన్యప్రాణులు, పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని మంథని అటవీ రేంజ్ అధికారి ఎం. వినయ్ నాయక్ అన్నారు. శనివారం ముత్తారం (మంథని) మండలంలోని పారుపల్లి గ్రామ పరిధిలో మైదంబండ బీట్, బేగంపేట సెక్షన్‌లో ఉన్న పారుపల్లి పెద్ద చెరువు వద్ద “బర్డ్ వాక్స్ అండ్ వైల్డ్ లైఫ్ అవేర్‌నెస్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువతకు అడవుల్లో నివసించే వివిధ రకాల పక్షులు, వన్యప్రాణులు, జీవ వైవిధ్యం ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంథని అటవీ రేంజ్ అధికారి ఎం. వినయ్ నాయక్ మాట్లాడుతూ, ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో పక్షులు, వన్యప్రాణులు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. జీవ వైవిధ్య పరిరక్షణ ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. అడవులు, చెరువులు, సహజ వనరుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. కార్యక్రమంలో భాగంగా బర్డ్ వాచింగ్, ట్రెక్కింగ్, పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ అంశాలపై ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. పారుపల్లి గ్రామ సర్పంచ్ చొప్పరి సంపత్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రకృతి సంపద పరిరక్షణకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి జె. తిరుపతి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎస్.కే. నహీదా పర్వీన్ (బేగంపేట), ఎస్.డి. రహమతుల్లా, ఎం. అమీరుద్దీన్ ఫారెస్ట్ బీట్ అధికారులు ఎస్. మేఘరాజ్, టి. రామ్‌సింగ్, ఎ. మాధురి, పి. రంజిత, బయాలజిస్ట్ చంద్రకాంత్, పారుపల్లి గ్రామ సర్పంచ్ చొప్పరి సంపత్, పోతారం, పారుపల్లి గ్రామాల ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, యువతతో పాటు మొత్తం 48 మంది పాల్గొన్నారు.