janamvoice.com
Newspaper Banner
Date of Publish : 22 October 2026, 3:02 pm Digital Edition : JANAM VOICE

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

  • ఊషన్నపల్లి పాఠశాలకు రూ.20 వేల విలువైన గ్లాస్ బోర్డు వితరణ.
  • ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని దాత అనుముల అశోక్ రెడ్డి పిలుపు.

జనం వాయిస్, కాల్వశ్రీరాంపూర్, అక్టోబర్ 22:

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని దాత అనుముల అశోక్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు గురువారం రూ.20 వేల విలువైన గ్లాస్ బోర్డును విరాళంగా అందజేశారు. గ్రామానికి చెందిన అశోక్ రెడ్డి ప్రస్తుతం హనుమకొండలో నివాసం ఉంటున్నారు. దసరా సెలవుల సందర్భంగా స్వగ్రామానికి వచ్చిన ఆయన విద్యార్థుల ప్రయోజనార్థం తన తండ్రి అనుముల రాజేశం, సోదరుడు అనుముల శ్రీనివాస్ రెడ్డి, ప్రముఖ పాత్రికేయుడు ముస్కు అశోక్, రేకుల రఘులతో కలిసి గ్లాస్ బోర్డును పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్యకు అందజేశారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివిన అశోక్ రెడ్డి గతంలో ఈ గ్లాస్ బోర్డు ద్వారా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించేవారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన, శాస్త్రీయమైన విద్యను అందిస్తున్నారని ప్రశంసించారు. పాఠశాలలో నూతన భవనాల నిర్మాణంతో పాటు విద్యార్థుల పదజాల అభివృద్ధికి ఉపయోగపడేలా గోడలపై చిత్రాలు, విద్యాసంబంధిత అంశాలను తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల్లో వేలాది రూపాయలు ఖర్చు చేయకుండా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాల వసతులు, బోధనా విధానం ఆదర్శంగా ఉన్నాయని పేర్కొన్నారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి సహకరించిన అశోక్ రెడ్డి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. దాతలను అభినందిస్తూ గ్రామస్తులు, తల్లిదండ్రులు సైతం పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అనుముల రాజేశం, అనుముల శ్రీనివాస్ రెడ్డి, పాత్రికేయుడు ముస్కు అశోక్, గంగారం గ్రామపంచాయతీ సర్పంచి రేకుల జ్యోతి భర్త రేకుల రఘు తదితరులు పాల్గొన్నారు.