తిరుపతిలో సహాయం పేరుతో విద్యార్థినిపై అఘాయిత్యం…ర్యాపిడో డ్రైవర్ అరెస్ట్.
-డబ్బు సాయం పేరుతో గదికి తీసుకెళ్లి దారుణం.
-పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభం.
జనం వాయిస్,తిరుపతి, డిసెంబర్09 :
తిరుపతి నగరంలో మరోసారి మానవత్వాన్ని మరిచిపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. పాలిటెక్నిక్‌లో చదువుతున్న మైనర్ విద్యార్థినికి సహాయం చేస్తానని నమ్మబలికిన ర్యాపిడో ఆటో డ్రైవర్ సాయికుమార్ దారుణంగా అత్యాచారం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పరిచయం పేరిట విద్యార్థినిపై నమ్మకం పెంచుకుని, చివరకు ఆ నమ్మకాన్ని దుర్వినియోగం చేసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.
వివరాల్లోకి వెళితే—ఎస్వీ పాలిటెక్నిక్‌లో చదువుతున్న బాధితురాలు ప్రైవేట్ హాస్టల్‌ను మార్చుకునే సందర్భంలో ర్యాపిడో ఆటో బుక్ చేసింది. ఆ ప్రయాణంలోనే డ్రైవర్ సాయికుమార్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. విద్యార్థిని ఫోన్ నంబర్ తీసుకున్న నిందితుడు తరచూ మాట్లాడి, అవసరమైతే డబ్బు సహాయం చేస్తానంటూ నమ్మబలికాడు.కొన్ని రోజుల తరువాత విద్యార్థినికి నిజంగానే డబ్బు అవసరం ఏర్పడటంతో అతడిని సంప్రదించింది.అవకాశమొచ్చిందని భావించిన సాయికుమార్, సహాయం అందిస్తానంటూ ఆమెను తన గదికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించడంతో విద్యార్థిని తీవ్ర భయానికి గురైంది.కానీ, భయంతో కుంగిపోయిన విద్యార్థిని తన స్నేహితురాలికి విషయం చెప్పడంతో, ఆమె ధైర్యం చెప్పి పోలీసులను ఆశ్రయించమని సూచించింది. చివరకు అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నిజం వెలుగులోకి వచ్చింది. మినర్ బాధితురాలు కావడంతో పోలీసులు వెంటనే సాయికుమార్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై నగరంలో ఆగ్రహావేశం వ్యక్తమవుతోంది. సహాయం పేరుతో మైనర్లను లక్ష్యంగా చేసుకునే నేరస్థులపై కఠిన చర్యలు తప్ప మరొకదానికి తావులేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.