janamvoice.com
Newspaper Banner
Date of Publish : 29 May 2026, 3:26 pm Digital Edition : JANAM VOICE

ప్లాస్టిక్ నోట్లకు ఆర్‌బీఐ సిద్ధం.

ప్లాస్టిక్ నోట్లకు ఆర్‌బీఐ సిద్ధం.

త్వరలో ప్రయోగాత్మకంగా విడుదలకు ప్రణాళిక.
ముద్రణ ఖర్చులు తగ్గించడమే లక్ష్యం.
చిరిగిన నోట్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.

జనం వాయిస్, ముంబై, 29 మే :

దేశంలో త్వరలోనే ప్లాస్టిక్ ఆధారిత కరెన్సీ నోట్లు చలామణిలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. నగదు వినియోగం నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త తరహా పాలిమర్ నోట్ల ప్రవేశంపై దృష్టి సారించినట్లు సమాచారం. ఇటీవల నిర్వహించిన బోర్డు సమావేశాల్లో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు నోట్లతో పోలిస్తే ప్లాస్టిక్ నోట్లు ఎక్కువకాలం మన్నడంతో పాటు నిర్వహణ వ్యయం కూడా తగ్గే అవకాశాలు ఉండటంతో ఆర్‌బీఐ ఈ దిశగా అడుగులు వేస్తోంది. దేశంలో కరెన్సీ నోట్ల ముద్రణ ఖర్చులు గణనీయంగా పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో మాత్రమే నోట్ల ముద్రణ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చినట్లు సమాచారం. నోట్ల తయారీ, రవాణా, భద్రత, పాడైన నోట్ల మార్పిడి వంటి అంశాలు ఆర్థిక భారం పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో దీర్ఘకాలం ఉపయోగపడే పాలిమర్ నోట్లు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
కొత్త నోట్ల ప్రవేశానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా ఏటీఎం యంత్రాల్లో సాంకేతిక మార్పులు చేపట్టే అవకాశం ఉంది. ప్లాస్టిక్ నోట్ల మందం, నిర్మాణం, గుర్తింపు విధానం భిన్నంగా ఉండటంతో నగదు పంపిణీ వ్యవస్థను నవీకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా నోట్లను విడుదల చేసి వాటి పనితీరును పరిశీలించే యోచనలో ఆర్‌బీఐ ఉన్నట్లు తెలుస్తోంది. డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్నప్పటికీ దేశంలో నగదు చలామణి మాత్రం తగ్గడం లేదు. మార్కెట్లో భారీ స్థాయిలో నగదు వినియోగం కొనసాగుతోంది. ఈ కారణంగా కొత్త నోట్ల ముద్రణ అవసరం కూడా పెరుగుతోంది. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు, గ్రామీణ ప్రాంతాలు, దినసరి లావాదేవీల్లో ఇప్పటికీ నగదు ప్రధాన పాత్ర పోషిస్తోంది.
ప్రస్తుతం ఆర్‌బీఐ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో చిరిగిపోయిన, పాడైన నోట్ల నిర్వహణ ఒకటి. ప్రతి సంవత్సరం కోట్ల సంఖ్యలో పాత నోట్లను వెనక్కి తీసుకుని వాటిని నాశనం చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా రూ.100, రూ.500 నోట్లు అధిక వినియోగం కారణంగా త్వరగా పాడవుతున్నాయి. ప్లాస్టిక్ నోట్లు వస్తే వాటి జీవితకాలం ఎక్కువగా ఉండటంతో ఈ సమస్య గణనీయంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అనేక దేశాలు పాలిమర్ కరెన్సీని విజయవంతంగా ఉపయోగిస్తున్నాయి. భారతదేశంలో కూడా గతంలో ప్రయోగాత్మకంగా ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టే ప్రయత్నాలు జరిగినప్పటికీ వివిధ కారణాలతో అమలు కాలేదు. అయితే ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం మరింత అభివృద్ధి చెందడంతో ఆర్‌బీఐ మళ్లీ ఈ ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతమైతే రానున్న రోజుల్లో దేశ ప్రజలు ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ఉపయోగించే అవకాశం ఉంది.