కమ్యూనిటీ కాంటాక్ట్‌తో ప్రజలకు భరోసా.
– గంజాయి,నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి.
– 51 పత్రాలు లేని వాహనాల స్వాధీనం.
– సమస్యలుంటే వెంటనే డయల్-100కు సమాచారం ఇవ్వాలి.
– రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా.
జనం వాయిస్, రామగుండం, జూన్ 06:
ప్రజలు ఎలాంటి భయం లేకుండా ప్రశాంత వాతావరణంలో జీవించేందుకు భరోసా కల్పించడం పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసీఆర్ కాలనీలో శనివారం నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్ పర్యవేక్షణలో, వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్లు ఇంద్రసేనారెడ్డి, ఆఫ్జాలోద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా గంజాయి అక్రమ రవాణా,నిల్వ, సరఫరాపై ప్రత్యేక నిఘా చేపట్టడంతో పాటు అనుమానాస్పద ప్రాంతాలు,నివాస గృహాల్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో పత్రాలు లేని 51 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ కార్యక్రమానికి హాజరైన పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.బ్లూ కోల్ట్స్,పెట్రోకార్ సిబ్బంది క్రమం తప్పకుండా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారా అనే విషయాన్ని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తుల గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.ఈ సందర్భంగా మహిళలతో డయల్-100కు కాల్ చేయించి పోలీసుల స్పందన తీరును ప్రత్యక్షంగా ప్రదర్శించారు.కాల్ అందుకున్న వెంటనే స్పందించిన పోలీసుల పనితీరుపై స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తూ, పోలీసులపై తమ నమ్మకం మరింత పెరిగిందని తెలిపారు.సీపీ మాట్లాడుతూ, కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాల ద్వారా అనుమానాస్పద వ్యక్తులు,రౌడీషీటర్లు, పాత నేరస్తులను గుర్తించి వారి వివరాలు, వేలిముద్రలను సేకరిస్తున్నామని తెలిపారు.దీంతో వారు ఎక్కడైనా నేరాలకు పాల్పడితే సులభంగా గుర్తించే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని,ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల జీవన విధానం, సామాజిక పరిస్థితులు,స్థానిక సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు.
మహిళలు,యువత, చిన్నారులతో మాట్లాడటం ద్వారా వారి ఆలోచనలు, అవసరాలను తెలుసుకొని తగిన మార్గనిర్దేశం చేయగలుగుతామని తెలిపారు.ఇతర ప్రాంతాలు లేదా రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు ఇళ్లు అద్దెకు ఇచ్చినా, ఉద్యోగాల్లో నియమించినా వారి పూర్తి వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని కోరారు.ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే డయల్-100కు కాల్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, ఇన్‌స్పెక్టర్లు ఇంద్రసేనారెడ్డి, ఆఫ్జాలోద్దీన్, రామగుండం సీఐ కృష్ణకుమార్, కమాన్‌పూర్ ఎస్సై ప్రసాద్,వన్‌టౌన్ ఎస్సైలు రమేష్, మనోహర్,అనూషతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
