కురవి ప్రభుత్వ భూములపై ‘జనం వాయిస్’ కథనాలకు స్పందన..!
- వరుస కథనాలపై సీఎం కార్యాలయం ఆరా జిల్లా కలెక్టర్ ద్వారా వివరాల సేకరణకు అధికారులకు ఆదేశాలు?.
- జిల్లా కలెక్టర్ ద్వారా వివరాల సేకరణకు అధికారులకు ఆదేశాలు?.
- 275 ఎకరాల ప్రభుత్వ, సీలింగ్, పీఓటీ, భూదాన్ భూములపై ఫిర్యాదులు.
- సర్వే నంబర్ 177తో పాటు ప్రభుత్వ భూములపై సమగ్ర విచారణకు డిమాండ్.
మహబూబాబాద్, సెప్టెంబర్ 7, (జనం వాయిస్) :
మహబూబాబాద్ జిల్లా కురవి గ్రామ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూముల పరిరక్షణ, ఆక్రమణల ఆరోపణలు, రికార్డుల పరిశీలనపై ‘జనం వాయిస్’ దినపత్రికలో ప్రచురితమైన వరుస కథనాలకు స్పందన లభించినట్లు సమాచారం. ప్రభుత్వ భూముల అంశంపై ప్రచురితమైన కథనాల నేపథ్యంలో తెలంగాణ సీఎం కార్యాలయం జిల్లా కలెక్టర్ ద్వారా వివరాలు ఆరా తీస్తున్నట్లు అధికార వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. కురవి గ్రామ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ, అబాది, సీలింగ్, పి.ఓ.టి., భూదాన్ తదితర భూములపై అనుమానాలు, ఆక్రమణల ఆరోపణలు ఉన్నాయని పేర్కొంటూ ఇటీవల ‘జనం వాయిస్’ వరుస కథనాలను ప్రచురించింది. ముఖ్యంగా సర్వే నంబర్ 177తో పాటు ప్రభుత్వ భూములను గుర్తించి, సమగ్ర సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించాలని ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు అధికారులను కోరుతున్నారు.
275 ఎకరాల భూములపై విచారణకు డిమాండ్.
కురవి గ్రామ రెవెన్యూ పరిధిలో రికార్డుల ప్రకారం 275 ఎకరాల 22 గుంటల ప్రభుత్వ, ఇతర కేటాయింపు భూములు ఉన్నట్లు ఫిర్యాదుదారులు పేర్కొంటున్నారు. ఇందులో అబాది 43 ఎకరాల 09 గుంటలు, సీలింగ్ 11 ఎకరాల 19 గుంటలు, ప్రభుత్వ భూమి 158 ఎకరాల 18 గుంటలు, పి.ఓ.టి. భూములు 57 ఎకరాల 35 గుంటలు, భూదాన్ భూమి 4 ఎకరాలు ఉన్నట్లు వారు వెల్లడించారు. ఈ భూములన్నింటినీ క్షేత్రస్థాయిలో సర్వే చేసి, రికార్డులతో సరిపోల్చి, ఆక్రమణలు లేదా అక్రమ బదలాయింపులు జరిగాయా అనే అంశాన్ని నిగ్గు తేల్చాలని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి.
సర్వే నంబర్ 177పై ప్రత్యేక దృష్టి.
కురవి గ్రామంలోని సర్వే నంబర్ 177లో ఉన్న ప్రభుత్వ భూములపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. ప్రభుత్వ భూముల హద్దులను గుర్తించి హద్దురాళ్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు భవిష్యత్‌లో ఆక్రమణలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
‘జనం వాయిస్’ ఎక్స్ పోస్టులకు స్పందన.
ప్రభుత్వ భూముల అంశంపై ప్రచురించిన వరుస కథనాలను ‘జనం వాయిస్’ జిల్లా బ్యూరో బేతమళ్ల సహాదేవ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలంగాణ సీఎస్, సీఎం కార్యాలయం, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం కార్యాలయం స్పందించి జిల్లా కలెక్టర్ ద్వారా కురవి ప్రభుత్వ భూముల అంశంపై వివరాలు సేకరిస్తున్నట్లు అధికారుల ద్వారా సమాచారం వెలువడింది.
వాస్తవాలు వెలుగులోకి రావాలనే డిమాండ్.
కురవి గ్రామ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములపై వస్తున్న ఆరోపణలు, రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితులపై నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని స్థానికులు కోరుతున్నారు. ఆక్రమణలు, అక్రమ బదలాయింపులు లేదా రికార్డులలో అవకతవకలు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ‘జనం వాయిస్’ వరుస కథనాలపై ఉన్నతస్థాయిలో స్పందన రావడంతో కురవి ప్రభుత్వ భూముల వ్యవహారంపై అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపడుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.