స్నేహితుల కోసం ప్రాణత్యాగం.
– అనురూప్‌కు ఘన నివాళి
– ముఖ్యమంత్రి సంతాపం
– కుటుంబానికి అండగా ప్రభుత్వం
జనం వాయిస్, హైదరాబాద్, జూన్ 9:
ముగ్గురు స్నేహితుల ప్రాణాలను కాపాడి తన ప్రాణాలను అర్పించిన తెలంగాణ యువకుడు కోడూరు అనురూప్ రెడ్డికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. అత్యంత విషాదకరమైన ఈ సంఘటన రాష్ట్ర ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. అనురూప్ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, మానవతా విలువలు చిరస్మరణీయమని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల తరఫున అనురూప్ తల్లిదండ్రులు, సోదరుడు ఆశ్రిత్ రెడ్డి, కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం కుటుంబానికి అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. అనురూప్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
అమెరికాలోని లూసియానా రాష్ట్రంలోని టోరో బయూ పార్క్‌లో గత నెల ఇరవై తొమ్మిదో తేదీన ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కేవలం ఇరవై మూడు సంవత్సరాల వయస్సులోనే ఉజ్వల భవిష్యత్తు కలిగిన అనురూప్ అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించి అందరికీ ఆదర్శంగా నిలిచారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రమాదంలో చిక్కుకుని మునిగిపోతున్న తన ముగ్గురు స్నేహితులను కాపాడేందుకు ఏమాత్రం వెనుకాడకుండా నీటిలోకి దూకిన అనురూప్, వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు. అయితే ఆ ప్రయత్నంలో తన ప్రాణాలను కోల్పోవడం అత్యంత విషాదకరమని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అతని త్యాగం మానవత్వానికి గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు.
అనురూప్ చూపిన కరుణ, నిస్వార్థ సేవాభావం, ధైర్యసాహసాలు మహోన్నత వ్యక్తిత్వానికి నిదర్శనమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. యువతకు అతని జీవితం స్ఫూర్తిగా నిలుస్తుందని, సమాజం ఎప్పటికీ గుర్తుంచుకునే వీరుడిగా అనురూప్ నిలిచిపోతాడని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు అనురూప్ నివాసానికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాష్ట్రం గర్వించే యువకుడిని కోల్పోవడం తీరని లోటని వారు పేర్కొన్నారు.