janamvoice.com
Newspaper Banner
Date of Publish : 25 December 2025, 11:26 pm Digital Edition : GATTU MAHESH

లోన్ మాఫీ కోసం భర్తను బలి.

లోన్ మాఫీ కోసం భర్తను బలి.

-రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన ఘోర హత్య.

-బోరున విలపించిన భార్యే హంతకురాలని తేల్చిన ఖాకీలు.

జనం వాయిస్, మహబూబాబాద్, డిసెంబర్ 25:

సినిమా కథలను కూడా మించిపోయే సంచలనాత్మక నేరకథ మహబూబాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. హౌస్ లోన్ మాఫీ కావాలన్న దురాశతో ప్రియుడితో కలిసి భర్తను పక్కా స్కెచ్ వేసి హతమార్చిన భార్య వ్యవహారం పోలీసుల దర్యాప్తులో బయటపడింది. భర్తను చంపించిన తరువాత అదే శవం వద్ద లబోదిబోమంటూ విలపించిన ఆ మహిళే అసలు హంతకురాలని ఖాకీలు తేల్చడంతో గ్రామమంతా షాక్‌కు గురైంది. ఈ నెల 22వ తేదీన కేసముద్రం మండలం బోడమంచతండా సమీపంలో భూక్యా వీరన్న అనే కౌలు రైతు అనుమానాస్పదంగా మృతి చెందాడు. రోడ్డు పక్కన మృతదేహం, దానిపై బైక్ పడేసి ఇది రోడ్డు ప్రమాదమన్నట్లుగా సీన్ క్రియేట్ చేశారు. చూసిన ఎవరికైనా ఇది యాక్సిడెంట్ అనిపించేలా పక్కా ప్లాన్ అమలు చేశారు. అయితే మృతదేహం చుట్టూ కనిపించిన రక్తపు మరకలు, శవాన్ని పొలం వైపు ఈడ్చుకువచ్చిన ఆనవాళ్లు ఈ ఘటన వెనుక ఘోర హత్య దాగి ఉందన్న అనుమానాలను బలపరిచాయి.మృతుడు ఇదే తండాకు చెందినవాడని తెలియడంతో అతని భార్య విజయ డెడ్ బాడీ వద్ద బోరున విలపించింది. తన భర్తను ఎవరో పథకం ప్రకారం హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని పోలీసుల ముందు, మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె రోదనలు చూసి గ్రామస్తులంతా భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఈ ఘటన తండాలో అగ్గి రాజేసింది. హత్యకు కారణమన్న అనుమానంతో ఆర్‌ఎం‌పి భరత్‌కు చెందిన బైక్‌ను దగ్ధం చేయడంతో పాటు, ఆస్పత్రిలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. పరిస్థితి చేయి దాటకుండా పోలీసులు భారీగా మోహరించాల్సి వచ్చింది.సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు ఇది కచ్చితంగా పథకం ప్రకారం జరిగిన హత్యేనని నిర్ధారణకు వచ్చారు. టెక్నాలజీ ఆధారంగా సెల్‌ఫోన్ కాల్ డేటా, కదలికల ఆధారాలను విశ్లేషించి కేవలం 24 గంటల్లోనే అసలు నిందితులను గుర్తించారు. మృతుడి భార్య విజయ, ఆమె ప్రియుడు బాలాజీ, ఆర్‌ఎం‌పి భరత్‌లే ఈ హత్యకు పాల్పడ్డారని పోలీసులు తేల్చారు. హౌస్ లోన్‌కు సంబంధించిన ఇన్సూరెన్స్ ద్వారా లోన్ మాఫీ అవుతుందన్న సలహాతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అప్పుల భారంతో ఇబ్బందులు పడుతున్న వీరన్న పరిస్థితిని అవకాశంగా మార్చుకున్న విజయ, వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. లోన్ మాఫీ అయితే ఆర్థిక భారం తీరుతుందని, ఎవరి అడ్డు లేకుండా జీవించవచ్చన్న దురాలోచనతో ఈ ఘోర హత్యకు పాల్పడ్డారని స్పష్టం చేశారు. నిందితుల అరెస్టుతో తండాలో నెలకొన్న రెండు రోజుల హై టెన్షన్‌కు తెరపడిందని, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని పోలీసులు వెల్లడించారు.