janamvoice.com
Newspaper Banner
Date of Publish : 27 May 2026, 2:46 pm Digital Edition : JANAM VOICE

సహారా డిపాజిట్లు వెంటనే చెల్లించాలి.. లేదంటే ఆత్మహత్యలే శరణ్యం!

సహారా డిపాజిట్లు వెంటనే చెల్లించాలి.. లేదంటే ఆత్మహత్యలే శరణ్యం!

  • కాలపరిమితి తీరినా పైసలివ్వడం లేదు..
  • మంచిర్యాలలో సహారా బాధితుల ఆందోళన.
  • ఎంపీ గడ్డం వంశీకృష్ణ, కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి.
  • జనం వాయిస్, మంచిర్యాల, (మే 27):
  • మంచిర్యాల : సహారా ఇండియా సంస్థలో తాము చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ల కాలపరిమితి ముగిసి 4-5 ఏళ్లు గడుస్తున్నా యాజమాన్యం డబ్బులు చెల్లించకపోవడంపై మంచిర్యాల జిల్లా కేంద్రంలో సమావేశమైన బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది బాధితులకు సహారా యాజమాన్యం రూ. 1,40,000 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం రూ. 5,000 కోట్లు మాత్రమే చెల్లించారని, మిగతా సొమ్మును వెంటనే చెల్లించకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ/కూటమి) ప్రభుత్వం వెంటనే స్పందించి, ఢిల్లీలోని భారతీయ సెక్యూరిటీల ఎక్స్ఛేంజ్ బోర్డు (సెబీ) సంస్థతో సంప్రదింపులు జరిపి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన ఈ ఆందోళన, నిరసన సమావేశంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు, తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, సహారా బాధితులు పులి కృష్ణ, మురహరి, రమేష్, గంగయ్య, రాజన్న, చారి తదితరులు పాల్గొని తమ మద్దతును తెలిపారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది పేద, మధ్యతరగతి ప్రజలు, సింగరేణి విశ్రాంత ఉద్యోగులు తమ కష్టార్జితాన్ని సహారాలో దాచుకుని నేడు రోడ్డున పడ్డారని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు (ఎంపీ) శ్రీ గడ్డం వంశీకృష్ణ గారు స్థానిక ప్రజల కష్టాలను గుర్తించి, ఈ సహారా బాధితుల సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌లో ఈ విషయమై గళం విప్పి, తమకు రావాల్సిన మెచ్యూరిటీ డబ్బులు త్వరగా అందేలా చొరవ చూపి తమ ప్రాణాలను కాపాడాలని బాధితులు ఎంపీ గారిని సవినయంగా అభ్యర్థించారు.