janamvoice.com
Newspaper Banner
Date of Publish : 12 September 2026, 1:44 pm Digital Edition : JANAM VOICE

మహిళలు మాత్రమే తాళి వేసుకోవాలా.. పెళ్లి గుర్తుగా పురుషులు కూడా ఏదైనా ధరించాలి: నటి నమిత.

మహిళలు మాత్రమే తాళి వేసుకోవాలా.. పెళ్లి గుర్తుగా పురుషులు కూడా ఏదైనా ధరించాలి: నటి నమిత.

వివాహం ఇద్దరు వ్యక్తుల జీవితాలను కలిపే బంధమన్న నమిత.

పెళ్లి తర్వాత మహిళలపై ఎన్నో నిబంధనలు ఉన్నాయని విమర్శ.

నియమాలు మహిళలకు మాత్రమే ఎందుకు పరిమితం కావాలని ప్రశ్న.

జనం వాయిస్, వెబ్ డెస్క్, సెప్టెంబర్ 12:

ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి నమిత… పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా వివాహ వ్యవస్థ, మహిళలపై అమలవుతున్న సంప్రదాయ నిబంధనలపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి చర్చల్లో నిలిచారు. వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలను, భావోద్వేగాలను కలిపే సమానమైన బంధమని… అలాంటప్పుడు పెళ్లికి సంబంధించిన నియమాలు, బాధ్యతలు కేవలం మహిళలకే ఎందుకు పరిమితం కావాలని ఆమె ప్రశ్నించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
వివాహ ఆచారాల గురించి మాట్లాడుతూ… పెళ్లి తర్వాత మహిళలు ఎలా ఉండాలి, ఏం ధరించాలి, ఏయే సంప్రదాయాలను పాటించాలి అనే విషయంలో సమాజంలో ఎన్నో నియమాలు ఉంటాయని నమిత అన్నారు. కానీ పురుషుల విషయంలో ఇలాంటి నిబంధనలు, ఆంక్షలు చాలా తక్కువగా ఉండటం సరైనది కాదని… మారుతున్న కాలానికి అనుగుణంగా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా వివాహానికి గుర్తుగా మహిళలు మాత్రమే తాళిబొట్టు ఎందుకు ధరించాలని, పెళ్లయిందనే గుర్తింపుగా పురుషులు కూడా ఏదో ఒక గుర్తును ఎందుకు ధరించకూడదని ఆమె అన్నారు.
నమిత చేసిన ఈ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఆధునిక కాలంలో భార్యాభర్తలిద్దరికీ సమాన హక్కులు, ప్రాధాన్యత ఉండాలని కోరుకునే కొందరు నెటిజన్లు ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తుండగా… మరికొందరు మాత్రం తరతరాలుగా వస్తున్న సంస్కృతి, సాంప్రదాయాల ప్రాధాన్యతను అర్థం చేసుకోకుండా ఇలా ప్రశ్నించడం సరికాదని విమర్శలు గుప్పిస్తున్నారు.