సంక్రాంతికి విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు.
పండుగ రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ కీలక నిర్ణయం.
విశాఖపట్నం–చర్లపల్లి, అనకాపల్లి–వికారాబాద్ ప్రత్యేక సర్వీసులు.
జనవరి 10 నుంచి పలు తేదీల్లో రాకపోకలు.
జనం వాయిస్, అమరావతి, జనవరి 01:
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భారతీయ రైల్వే విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే శాఖ వివరాల ప్రకారం, విశాఖపట్నం నుంచి చర్లపల్లికి వెళ్లే ప్రత్యేక రైలు నంబరు 08511 జనవరి 10, 12, 17, 19 తేదీల్లో విశాఖపట్నంలో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో జనవరి 11, 13, 18, 20 తేదీల్లో చర్లపల్లిలో మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7 గంటలకు విశాఖపట్నానికి చేరుకుంటుందని తెలిపారు. అదేవిధంగా, రైలు నంబరు 07416 అనకాపల్లి నుంచి వికారాబాద్ కు ప్రత్యేకంగా నడవనుంది. ఈ రైలు జనవరి 18న రాత్రి 9.45 గంటలకు అనకాపల్లి నుంచి బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు వికారాబాద్‌కు చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో విజయవాడ మీదుగా ప్రయాణించే రైళ్లకు భారీ డిమాండ్ ఉండటంతో, ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ చేసుకుని ఈ ప్రత్యేక సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.