వాషింగ్టన్ సుందర్ విధ్వంసం.. భారత్ ఘన విజయం.
జనం వాయిస్ వెబ్, స్పోర్ట్స్:
ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా ఎట్టకేలకు విజయాన్నందుకుంది. హోబర్ట్ వేదికగా ఆదివారం జరిగిన మూడో టీ20లో సమష్టిగా రాణించిన భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
లోయరార్డర్ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులు చేసింది. టీమ్ డేవిడ్(38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 74), మార్కస్ స్టోయినీస్(39 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 64) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/31) మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ(2/33) రెండు వికెట్లు తీయగా.. శివమ్ దూబే(1/43) ఒక వికెట్ పడగొట్టాడు._
అనంతరం భారత్ 18.3 ఓవర్లలో 5 వికెట్లకు 188 పరుగులు చేసి గెలుపొందింది. వాషింగ్టన్ సుందర్(23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 49 నాటౌట్), జితేష్ శర్మ(13 బంతుల్లో 3 ఫోర్లతో 22 నాటౌట్), తిలక్ వర్మ(26 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 29) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్ మూడు వికెట్లు తీయగా.. గ్జేవియర్ బార్ట్‌లెట్, మార్కస్ స్టోయినీస్ తలో వికెట్ తీసారు. బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.
ఈ మైదానంలో ఇదే భారీ టీ20 స్కోర్ కావడంతో పాటు అత్యధిక ఛేజింగ్ రికార్డ్ కూడా ఇదే కావడం విశేషం. ఈ మైదానంలో ఆస్ట్రేలియాకు ఇదే తొలి టీ20 పరాజయం కావడం గమనార్హం. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-1తో కొనసాగుతుంది. నాలుగో టీ20 గురువారం గోల్డ్ కోస్ట్ వేదికగా జరగనుంది. తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. రెండో టీ20 ఆసీస్ గెలిచిన సంగతి తెలిసిందే.
గిల్ నిరాశపర్చినా.
భారీ లక్ష్యచేధనలో టీమిండియా ఇన్నింగ్స్‌ను అభిషేక్ శర్మ దూకుడుగానే ఆరంభించాడు. భారీ సిక్సర్లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కానీ అతన్ని నాథన్ ఎల్లిస్ బోల్తా కొట్టించాడు. తెలివిగా బంతి వేగం పెంచి అభిషేక్ శర్మ(25)ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. తన మరుసటి ఓవర్‌లో శుభ్‌మన్ గిల్(15)ను ఎల్లిస్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భారీ సిక్సర్లతో వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అతన్ని మార్కస్ స్టోయినీస్ కుదురుకోనియలేదు. క్యాచ్ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.
గెలిపించిన సుందర్, జితేష్ శర్మ
క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్‌తో కలిసి తిలక్ వర్మ కాసేపు పోరాడాడు. ఓ భారీ సిక్సర్ బాదిన తిలక్ వర్మ.. ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నంలో గ్జేవియర్ బార్ట్‌లెట్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అక్షర్ పటేల్(17)ను నాథన్ ఎల్లిస్ ఔట్ చేయడంతో భారత్ 145 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో జితేశ్ శర్మతో కలిసి వాషింగ్టన్ సుందర్ చెలరేగాడు. భారీ సిక్సర్లతో వేగంగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. జితేశ్ శర్మ కూడా వినూత్న షాట్స్‌తో అతనికి అండగా నిలవడంతో భారత స్కోర్ బోర్డు పరుగెత్తింది. మార్కస్ స్టోయినీస్ బౌలింగ్‌లో జితేష్ శర్మ ఇచ్చిన క్యాచ్‌ను ఓవెన్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో జితేష్ శర్మ విన్నింగ్ షాట్ కొట్టి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.