పెండింగ్ చలాన్లపై వాహనాల సీజ్‌కు బ్రేక్..
– హైకోర్టు సీరియస్.
– కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై నోటీసులు.
– డీజీపీ సహా ఉన్నతాధికారులకు వివరణ కోరింపు.
– జూన్ 19కి తదుపరి విచారణ.
జనం వాయిస్, హైదరాబాద్, మే 01:
పెండింగ్ చలాన్లు ఉన్నాయనే కారణంతో వాహనాలను సీజ్ చేయడంపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. గతంలో జారీ చేసిన స్పష్టమైన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే పెండింగ్ చలాన్లు ఉన్నంత మాత్రాన వాహనాలను స్వాధీనం చేసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసినప్పటికీ, పోలీసులు ఆదేశాలను పట్టించుకోవడం లేదని బాధితుడు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. అధికారులు ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు రాష్ట్ర డీజీపీ, హోం శాఖ కార్యదర్శి, అదనపు సీపీ, రవాణా శాఖ కమిషనర్‌లకు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ వాహనాలను ఎందుకు సీజ్ చేస్తున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అధికారుల వివరణను సమర్పించాలని కోర్టు సూచించింది. సమగ్ర నివేదికను పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. చట్టబద్ధమైన ప్రక్రియలు పాటించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తు చేసింది. పెండింగ్ చలానాల విషయంలో పోలీసులు కేవలం జరిమానా వసూలు చేయాలే గానీ వాహనాలను సీజ్ చేసే అధికారం లేదని కోర్టు మరోసారి స్పష్టం చేసింది. ప్రజల హక్కులను పరిరక్షించాల్సిన అవసరాన్ని హైలైట్ చేసింది. ఈ కేసు విచారణను జూన్ 19వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు అధికారుల నుంచి సమగ్ర వివరణను కోరింది. ఈ పరిణామంతో చలాన్ల విషయంలో స్పష్టత నెలకొనే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.