janamvoice.com
Newspaper Banner
Date of Publish : 24 December 2025, 11:33 pm Digital Edition : GATTU MAHESH

అడవి సోమనపల్లి చెక్‌డ్యాం కూల్చివేతపై కఠిన చర్యలు.

అడవి సోమనపల్లి చెక్‌డ్యాం కూల్చివేతపై కఠిన చర్యలు.

– విజిలెన్స్ విచారణకు ఆదేశాలు.
– నాణ్యత లోపాలుంటే కఠిన శిక్ష.
– రైతుల ప్రయోజనాలపై రాజీ లేదు.
– మంత్రి శ్రీధర్ బాబు.

జనం వాయిస్, పెద్దపల్లి, డిసెంబర్ 24:
పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమనపల్లి గ్రామంలో చెక్‌డ్యాం కూలిన ఘటనను ప్రభుత్వం అత్యంత గంభీరంగా తీసుకుంటోందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ ఘటన సహజ కారణాల వల్ల జరిగిందా, లేక మానవ తప్పిదం కారణమా అన్న అంశాలపై సమగ్రంగా తెలుసుకునేందుకు విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.విచారణలో చెక్‌డ్యాం నిర్మాణంలో నాణ్యత లోపాలు ఉన్నట్లు తేలితే సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులు ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్ల ఇలాంటి ఘటన జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కావాలని నష్టం కలిగించినట్టు నిర్ధారణైతే తీవ్రమైన శిక్షలు విధిస్తామని తెలిపారు.చెక్‌డ్యాంలు రైతులకు, గ్రామీణ జీవనోపాధికి కీలకమని మంత్రి శ్రీధర్ బాబు గుర్తు చేశారు. భూగర్భ జలాల పెంపు, సాగునీటి భద్రత, వ్యవసాయ స్థిరత్వంలో చెక్‌డ్యాంల పాత్ర అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. అలాంటి నిర్మాణాల విషయంలో నిర్లక్ష్యం లేదా అవినీతిని ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు.
ఈ ఘటనకు బాధ్యులెవరో స్పష్టంగా గుర్తించి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణలో ఎక్కడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేస్తామని వెల్లడించారు. రైతుల ప్రయోజనాలు, ప్రజా సంపద రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.