చేదెక్కుతున్న చక్కెర.. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు.
“ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు” అంటూ మధ్యతరగతి ప్రజల ఆవేదన.
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 23 (జనం వాయిస్):
నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతోంది. దాదాపు 5,6సంవత్సరాలుగా కిలో చెక్కర రూ.40 పరిధిలో ఉన్న చక్కెర ధర ప్రస్తుతం గణనీయంగా పెరిగి వినియోగదారులకు చేదు అనుభవాన్ని మిగుల్చుతోంది.రూ.50జొన్నల ధర సైతం కిలో రూ.80కు చేరడంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చక్కెర, పప్పులు, నూనెలు, ధాన్యాలు, కూరగాయలతో పాటు పిల్లల చదువులకు సంబంధించిన ఫీజులు, యూనిఫాంలు, పుస్తకాలు, నోట్‌బుక్స్, స్టేషనరీ ఖర్చులు భారీగా పెరిగాయని మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు. ఆదాయం మాత్రం అదే స్థాయిలో ఉండగా ఖర్చులు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయని, “ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గతంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల పెరుగుదలను కారణంగా చూపుతూ, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయని ప్రజలు గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడిచమురు ధరల్లో మార్పులు వచ్చినప్పటికీ దేశంలో ఇంధన ధరలపై పెద్దగా ఉపశమనం కనిపించడం లేదని అంటున్నారు.నిత్యావసర ధరలను నియంత్రించడంలో ప్రభుత్వాలు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రైతుల నుంచి పంటలను తక్కువ ధరలకు కొనుగోలు చేసి నిల్వలు ఉంచి, మార్కెట్‌లో కొరత సృష్టించి ధరలు పెంచుతున్న పెద్ద వ్యాపారులపై పర్యవేక్షణ అవసరమని అభిప్రాయపడుతున్నారు.
ధరల పెరుగుదలపై ప్రభుత్వాలు తక్షణమే దృష్టి సారించి నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలని, మధ్యతరగతి కుటుంబాలకు ఊరట కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
