పరకాలలో యువకుడి అనుమానాస్పద మృతి.
– హత్యేనని కుటుంబ సభ్యుల ఆరోపణ.
జనం వాయిస్, పరకాల,జూన్ 3 :
నడికూడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మమ్మద్ షరీఫుద్దీన్ (35) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం పరకాల పట్టణంలో కలకలం రేపింది. మంగళవారం రాత్రి వచ్చిన ఫోన్ కాల్ అనంతరం బయటకు వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి చేరకపోగా, కొద్దిసేపటికే వెల్లంపల్లి రోడ్డులో మృతదేహంగా లభ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హన్మకొండ లోని ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తూ భార్యతో కలిసి పరకాలలో నివాసం ఉంటున్నాడు.షరీఫుద్దీన్ కు ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వాలు లేవని భార్య పేర్కొన్నారు. ఫోన్ కాల్ వచ్చిన కొద్ది గంటల్లోనే ఆయన మృతి చెందడం అనేక అనుమానాలకు తావిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. షరీఫుద్దీన్ ను రేకుల షెడ్డులో హత్య చేసి అనంతరం రోడ్డుపై పడేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆయనకు ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు? ఎక్కడికి పిలిచారు? చివరిసారిగా ఎవరిని కలిశారు? అనే అంశాలపై సమగ్ర విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు.కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించి మృతి వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీయాలని పోలీసు ఉన్నతాధికారులను కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పరకాల సిఐ క్రాంతి కుమార్ తెలిపారు.