రైతును అవమానించిన తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటు.
- ‘‘ఇంకా బతికే ఉన్నావా.. పురుగుల మందు తాగలేదా?’’ అంటూ అనుచిత వ్యాఖ్యలు.
- సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన తహసీల్దార్ వ్యాఖ్యల వీడియో.
- రైతు పట్ల అమానవీయ ప్రవర్తనపై వెల్లువెత్తిన ఆగ్రహం.
- ఆర్డీఓ విచారణ నివేదిక ఆధారంగా కలెక్టర్ హైమావతి చర్యలు.
- గజ్వేల్ తహసీల్దార్ చిట్టంపల్లి స్వామి సస్పెన్షన్.
జనం వాయిస్, సిద్దిపేట, అక్టోబర్ 11:
భూ సమస్య పరిష్కారం కోసం కార్యాలయానికి వచ్చిన రైతు పట్ల అమానవీయంగా వ్యవహరించి, అనుచిత వ్యాఖ్యలు చేసిన గజ్వేల్ తహసీల్దార్ చిట్టంపల్లి స్వామిపై సస్పెన్షన్ వేటు పడింది. ‘‘ఇంకా బతికే ఉన్నావా? పురుగుల మందు తాగలేదా?’’ అంటూ రైతును అవమానించిన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపించిన సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి, ప్రాథమిక నివేదిక ఆధారంగా తహసీల్దార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం మక్త మాసన్‌పల్లి గ్రామానికి చెందిన రైతు యేసు, ప్రాంతీయ వలయ రహదారి (ఆర్ఆర్ఆర్) భూసేకరణ పరిహారం విషయంలో తన బంధువులతో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్‌తో కలిసి తహసీల్దార్ చిట్టంపల్లి స్వామిని కలిశారు. తన సమస్యను వివరిస్తున్న రైతుతో అధికారి అనుచితంగా మాట్లాడినట్లు ఆరోపణలు వచ్చాయి. ‘‘ఇంకా బతికే ఉన్నావా? పురుగుల మందు తాగలేదా?’’ అంటూ ప్రశ్నించడంతో అక్కడున్నవారు విస్మయానికి గురయ్యారు. ఉద్దేశపూర్వకంగానే ఆ వ్యాఖ్యలు చేశారా అని ప్రశ్నించగా, ‘‘అవును.. ఉద్దేశపూర్వకంగానే అన్నాను’’ అని అధికారి సమాధానమిచ్చిన దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి.
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో తహసీల్దార్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే రైతులతో అధికారులు ఇలా వ్యవహరించడం ఏమిటంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ కె.హైమావతి విచారణకు ఆదేశించారు. రెవెన్యూ డివిజనల్ అధికారి నిర్వహించిన ప్రాథమిక విచారణలో తహసీల్దార్ ప్రవర్తన సరికాదని తేలడంతో నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా చిట్టంపల్లి స్వామిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ప్రధాన కార్యస్థానాన్ని విడిచి వెళ్లరాదని ఆదేశాల్లో స్పష్టం చేశారు.
అయితే, ఈ ఘటన సుమారు ఐదారు నెలల క్రితం జరిగినట్లు తెలుస్తోంది. అప్పట్లో తన భూ వివాదం పరిష్కారమైందని, పరిహారం సొమ్ము కూడా బ్యాంకు ఖాతాలో జమ అయిందని రైతు యేసు వెల్లడించిన మరో వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఘటన పాతదే అయినప్పటికీ రైతు పట్ల అధికారి వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారడంతో ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు చేపట్టారు.