నామినేషన్ కోసం రూ.8 కోట్ల పన్ను చెల్లింపు.
– నిజామాబాద్ కార్పొరేషన్ చరిత్రలో రికార్డు వసూలు.
– మేయర్ రేసులో కాంగ్రెస్ అభ్యర్థి చర్యపై రాజకీయ చర్చ.
– ఎన్నికల వేళ బయటపడిన కోట్ల బకాయిలు.
జనం వాయిస్, నిజామాబాద్, ఫిబ్రవరి 2:
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్ పదవి రేసులో ఉన్న కార్పొరేటర్ అభ్యర్థి కే. శమంత నరేందర్ రెడ్డి రూ.8,16,65,000 ఆస్తి పన్ను బకాయిలను ఒకేసారి చెల్లించారు. నామినేషన్‌కు అవసరమైన నో డ్యూ సర్టిఫికేట్ కోసం ఈ భారీ మొత్తం మున్సిపల్ ఖజానాకు చేరింది. 2009 నుంచి దాదాపు 17 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత వెలుగులోకి వచ్చాయి. నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో డైరెక్టర్‌గా ఉన్న నరేందర్ రెడ్డి భార్య కార్పొరేటర్‌గా పోటీ చేయాల్సి ఉండటంతో నో డ్యూ సర్టిఫికేట్ తప్పనిసరి అయ్యింది. బకాయిలు చెల్లిస్తేనే సర్టిఫికేట్ ఇస్తామని అధికారులు స్పష్టం చేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అర్ధరాత్రి 12 గంటల వరకు సాగిన వాదనల అనంతరం చట్టం ముందు అందరూ సమానమేనని, బకాయిలు తప్పనిసరిగా చెల్లించాల్సిందేనని న్యాయస్థానం తేల్చిచెప్పింది. దీంతో ఆరు భారీ డీడీల రూపంలో మొత్తం రూ.8.16 కోట్లను మున్సిపల్ అధికారులకు సమర్పించారు. ఇది నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలో ఒక వ్యక్తి నుంచి ఇంత భారీ పన్ను వసూలైన తొలి ఘటనగా నిలిచింది. సామాన్యుల నుంచి వందల రూపాయల పన్ను కోసం కఠినంగా వ్యవహరించే యంత్రాంగం, ఇన్నేళ్లుగా కోట్ల బకాయిలను ఎందుకు వసూలు చేయలేకపోయిందన్న అంశంపై ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతోంది. ఎన్నికలు వచ్చినప్పుడే బకాయిలు వసూలవుతాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మేయర్ పదవి మహిళలకు రిజర్వ్ కావడంతో నరేందర్ రెడ్డి ఈ భారీ మొత్తాన్ని చెల్లించారని స్థానికంగా చర్చ సాగుతోంది. ఈ పన్ను చెల్లింపు రాజకీయంగా ఆయనకు మైలేజ్ ఇస్తుందా, లేక విమర్శలకు దారితీస్తుందా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. అయితే, ఒక్క రాత్రిలో కార్పొరేషన్ ఖజానా కళకళలాడిన విషయం మాత్రం నగరమంతా హాట్ టాపిక్‌గా మారింది.